తెగల తగాదా!
మణిపూర్‌లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఒకప్పుడు ప్రకృతి రమణీయతకు, విభిన్న సంస్కృతుల సమ్మేళనానికి ఆలవాలమైన ఈశాన్య రాష్ట్రం ఇప్పుడు తెగల మధ్య విభేదాలు, ప్రజల్లో పరస్పర అనుమానాలు, ప్రతీకార దాడులతో అస్తిత్వ పోరాటం చేస్తున్నది. మూడేళ్ల క్రితం కుకీ, మైథేయి తెగల మధ్య రాజుకున్న మంటల సెగలు ఇప్పుడు నాగా తెగను తాకాయి. గత నెలలో అపహరణకు గురైన ఒక తెగకు చెందినవారిలో ఆరుగురి మృతదేహాలు లభ్యమవడం, ప్రతీకార దాడుల్లో మరో తెగకు చెంది న ఇద్దరు మరణించడం తాజా అల్లర్లకు కారణం.
తెగల మధ్య గత మూడేళ్లుగా జరుగుతున్న పోరులో 250 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయినా, 60 వేల మందికి పైగా నిరాశ్రయులైనా రాష్ట్ర, కేంద్ర ప్రభు త్వాలు పట్టించుకోకపోవడం శోచనీయం. ముఖ్యంగా అల్లర్లు మొదలైనప్పటి నుంచి తెగల మధ్య విభజన మరింతగా ఎక్కువైంది. ఒక తెగకు చెందిన ప్రజలను మరో తెగ ఆధిపత్యం ఉన్న గ్రామాల్లోకి రానివ్వకపోవడం, రహదారు లను దిగ్బంధించడం లాంటి చర్యలు కొనసాగుతూనే ఉండటం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతున్నది.
మాతృభూమిపై మరణభయంతో జీవించాల్సి రావడం అత్యంత బాధాకరం. ఇది ఒక ప్రాంత శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదు, సామాజిక విశ్వాసం పూర్తిగా దెబ్బతిన్నదనడానికి తార్కా ణం. అయితే, అల్లర్లను అదుపు చేసేందుకు అధికార బీజేపీ ముఖ్యమంత్రిని మార్చినా హింసకు పూర్తిస్థాయిలో అడ్డుకట్టపడకపోవడం ప్రభుత్వ వైఫల్యా న్ని తెలియజేస్తున్నది. నాయకత్వం మారినా హింసాత్మక ఘటనలు పునరావృతమవుతుండటం ద్వారా ఈ సమస్య ముఖ్యమంత్రుల మార్పుతో పరిష్కారమయ్యేది కాదని, మూల కారణాలను గుర్తించి సమగ్ర కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతున్నది. మరోవైపు, కేంద్ర పాలకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడం పెనుశాపంగా మారింది.
ప్రధాని స్వయంగా బాధిత కుటుంబాలను పరామర్శించి, అన్ని వర్గాల ప్రతినిధులతో చర్చలు జరిపితే సమస్య ఓ కొలిక్కిరావచ్చు. సంక్షోభ సమయంలో దేశ అత్యున్నత నాయకత్వం బాధితులకు అండగా నిలవడం పరిపాలనా చర్య మాత్రమే కాదు, నైతిక బాధ్యత కూడా. మణిపూర్ సమస్యను రాజకీయ కోణంలో మాత్రమే చూడకుండా మానవీయ దృక్పథంతో పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ప్రజల మధ్య విశ్వాసాన్ని పునర్నిర్మించాలి. అప్పుడే మణిపూర్ గాయాలు మానుతాయని చెప్పక తప్పదు.






