రతన్ టాటా వారసత్వం ఇదే!
2024 అక్టోబరులో దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణించిన తర్వాత, ఆయన జీవితాంతం శ్రమించి నిర్మించిన, బలోపేతం చేసిన సంస్థలు.. నాయకత్వం, భవిష్యత్తు, వారసత్వం, వాటి పాలనా విధానం వంటి కీలక ప్రశ్నలను ఎదుర్కొంటున్నాయి.
ఈ అంశాలపై జరుగుతున్న అంతర్గత చర్చల గురించి వ్యాఖ్యానించే స్థాయి నాకు లేదు. ఇది సందర్భం కూడా కాదు. కానీ, నేను ఒక్కటి మాత్రం చెప్పగలను. 2003 చివరిలో ప్రారంభమైన మా భాగస్వామ్యం 21 ఏళ్లపాటు సాగింది. ఈ క్రమంలో రతన్ టాటాతో అనేకసార్లు వ్యక్తిగతంగా జరిగిన సంభాషణలు, బోర్డ్ రూముల్లో జరిగిన చర్చలు, సన్నిహితంగా మెలిగిన సందర్భాల నుంచి గ్రహించిన ఆయన నాయకత్వ సూత్రాల గురించి మాత్రం నేను చెప్పగలను.. అని అంటున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ ఎం వామన్‌రావు.
నిజమైన బోర్డు రూములు కేవలం ఆమోద ముద్రలు వేసే వేదికలు కావు. అక్కడ భిన్నాభిప్రాయాలకు స్థానం ఉండాలి. అవసరమైతే తప్పులను ఎత్తిచూపాలి. అంతకంటే ముఖ్యంగా, తప్పు చేశామని అంగీకరించే మేధోనిజాయితీ ఉండాలి. ఆ సంస్కృతిని నిర్మించింది రతన్ టాటాయే.
నిజానికి, రతన్ టాటా వదిలివెళ్లిన అసలైన వారసత్వం.. ఆస్తులు, హోదాలు, అధికారాలు కావు; విలువలు, నిబద్ధత, నాయకత్వ ప్రమాణాలే ఆయన సమాజానికి అందించిన గొప్ప సంపదలు. ఆయన మరణించిన నేపథ్యంలో ఆ సూత్రాలు గతంలో కంటే నేడు మరింత ప్రాసంగికంగా, మార్గదర్శకంగా నిలుస్తాయని నేను విశ్వసిస్తున్నాను.
నన్ను మలిచిన నగరం హైదరాబాద్: శతాబ్దాల చరిత్ర కలిగిన నగరం హైదరాబాద్. నేను ఎవరు? నా బాధ్యత ఏమిటి? శాస్త్ర విజ్ఞానం సమాజానికి ఏం ప్రయోజనం చేకూర్చాలి? అనే ప్రశ్నలకు సమాధానాలను వెతికే నా దృక్పథాన్ని హైదరాబాద్ మలిచింది.
శాస్త్రం అనేది పరిశోధనలు, ప్రయోగశాలలకే పరిమితమైనది కాదని, అది మానవ జీవితాన్ని మెరుగుపరచే సాధనమనే అవగాహనను నాకు కల్పించింది. లండన్, బోస్టన్ నగరాలు నాకు శాస్త్ర విజ్ఞానం ఎలా ఆచరణలోకి వస్తుందో నేర్పించాయి. ప్రయోగశాలలు, నియంత్రణ వ్యవస్థలు, మూలధన మార్కెట్లు, నాలుగు ఖండాలకు విస్తరించిన చర్చలు ఇవన్నీ మూడు దశాబ్దాల పాటు నా వృత్తి జీవితానికి సహజమైన వాతావరణంగా మారాయి.
వైద్యశాస్త్రంపై చేసిన పరిశోధనను ఆధారంగా చేసుకుని నేను ఇండిజీన్ ఫార్మాస్యూటికల్స్ సంస్థను స్థాపించాను. ఆ సంస్థను ప్రపంచమంతటికి విస్తరించాను. ప్రపంచ వ్యాపార రంగంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని నిలదొక్కుకున్న ఒక పారిశ్రామికవేత్తకు ఉండే ఆత్మవిశ్వాసంతో 2003 చివరిలో జీవ ఔషధ రంగానికి సంబంధించిన ఒక ప్రతిపాదనతో బాంబే హౌస్ నాలుగో అంతస్తుకు చేరుకున్నాను. ఆ బాంబే హౌస్ నా జీవిత దృక్పథాన్నే మార్చేస్తుందని నేను అప్పుడు ఊహించలేదు. కానీ, అదే జరిగింది.
ఎందుకంటే, ఆ నాలుగో అంతస్తులో కూర్చున్న ఓ వ్యక్తి నన్ను బోస్టన్, వాషింగ్టన్, లండన్, క్యోటో, టొరొంటో నగరాల్లో నేను కలిసిన వారెవరూ అడగని ప్రశ్నను అడిగారు. ఆ తర్వాత జరిగిన రెండున్నర గంటల సంభాషణ నా ఆలోచనలకు కొత్త దిశను చూపించింది. అప్పటి నుంచి నేను ప్రతి సమావేశంలో, తీసుకున్న ప్రతి నిర్ణయంలో, అనుసరించిన ప్రతి మార్గంలో అది నాకు దిక్సూచిగా నిలిచింది.
అన్నింటినీ మార్చేసిన ఆ పరిచయం: 2003 చివర్లో జరిగిన ఆ సమావేశానికి అరగంట సమయం మాత్రమే కేటాయించారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వ్యవస్థాపక ప్రధాన కార్యనిర్వాహకులు ఎఫ్‌సీ కోహ్లీ ద్వారా నాకు రతన్ టాటాతో పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయం నా వృత్తి జీవితంలో అత్యంత కీలక మలుపుల్లో ఒకటిగా నిలిచింది. ఎఫ్‌సీ కోహ్లీ అసాధారణ వ్యక్తి. వ్యాపార అవసరాల కోసం కాకుండా, మేధోపరమైన సాన్నిహిత్యం వల్ల మేము దగ్గరయ్యాం. ప్రభుత్వాలు, పెట్టుబడులు మాత్రమే సాధించలేని మార్పును శాస్త్రం, సాంకేతికతలు తీసుకురాగలవని మేము విశ్వసించేవాళ్లం. అయితే, రతన్ టాటాతో నన్ను పరిచయం చేయాలనుకుంటున్నట్లు ఎఫ్‌సీ కోహ్లీ చెప్పినప్పుడు, దాన్ని ఆయన ఒక పరిచయ వేదికగా గాని, వృత్తిపరమైన అవకాశంగా గాని చిత్రీకరించలేదు. అది ఆయన దృష్టిలో ఒక బాధ్యతతో కూడిన కర్తవ్యంలా కనిపించింది. ఒక ప్రత్యేకమైన ధ్యేయంతో ముందుకుసాగే వ్యక్తులు తప్పనిసరిగా ఒకరినొకరు కలుసుకోవాలని దివంగత ఎఫ్‌సీ కోహ్లీ నమ్మేవారు. ఆ నమ్మకమే నన్ను రతన్ టాటా వద్దకు తీసుకెళ్లింది. తరువాత నా జీవిత దిశను మార్చింది.
ముందుగా మనిషిని చూడాలి: బాంబే హౌస్‌కు వెళ్లినప్పుడు ఒక పారిశ్రామికవేత్తగా నేను పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాను. మల్టీస్యూటిక్స్ వెనుక ఉన్న శాస్త్రీయ ఆధారాలు, మార్కెట్ అవకాశాలు, టాటా సంస్థతో భాగస్వామ్యం ఎందుకు వ్యూహాత్మకంగా అవసరమో సమగ్రంగా వివరించేందుకు సిద్ధపడ్డాను. కానీ, రతన్ టాటా దాన్ని క్షణాల్లోనే మరో దిశకు మళ్లించారు. నేను సిద్ధం చేసిన అంశాలను ఆయన తిరస్కరించలేదు, వాటి ప్రాధాన్యాన్ని తగ్గించలేదు. కానీ, నేను ఊహించని ఒక ప్రశ్నతో ఆ సంభాషణకు కొత్త అర్థాన్ని ఇచ్చారు.
ఆయన తెలుసుకోవాలనుకున్నది మార్కెట్ పరి మాణం గురించో, ఆదాయ అంచనాల గురించో, వ్యాపార లాభాల గురించో కాదు. ‘మీ పరిశోధన కోసం ఎదురుచూస్తున్న వారు ఎవరు? వారు ఎలాం టి బాధలతో జీవిస్తున్నారు? ఈ శాస్త్రీయ పరిశోధన ఫలిస్తే వారి జీవితాల్లో నిజంగా ఏ మార్పు వస్తుంది?’ ఇదే ఆయన అడిగిన ప్రశ్న. ఆ క్షణంలోనే నాకు ఒక గొప్ప నాయకత్వ సూత్రం అర్థమైంది.
శాస్త్రం విజయవంతమైందని చెప్పడానికి పరిశోధన పత్రాలు సరిపోవు. ఆ విజ్ఞానం ఎవరి బాధను తగ్గించింది? ఎవరి జీవితానికి ఆశను ఇచ్చింది? ఎవరి కుటుంబంలో వెలుగును నింపింది? అనే ప్రశ్నలకు సమాధానం దొరికినప్పుడే దానికి అసలు అర్థం వస్తుందని రతన్ టాటా ఆ తొలి భేటీలోనే నాకు నేర్పించారు.
నా వృత్తి జీవితంలో ఎంతోమంది ప్రభావశీల వ్యక్తులతో సమావేశమయ్యే అవకాశం నాకు లభించింది. ప్రధానమంత్రులు, దేశాధ్యక్షులు, ప్రపంచ స్థాయి కార్పొరేట్ సంస్థల పాలక మండళ్లు ఇలా అనేక సమావేశాల్లో నేను పాల్గొన్నాను. అయితే, ఒక సమావేశాన్ని ప్రారంభించిన వెంటనే, ఆ నిర్ణయాల చివరి లబ్ధిదారుల గురించి ముందుగా ప్రశ్నించిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారని అడిగితే, వారిని వేళ్ల మీద లెక్కపెట్టగలను. రతన్ టాటా మాత్రం అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరు కాదు; ఆయన ఎప్పుడూ అలాగే ఉండేవారు.
‘ఇది నిజంగా ఎవరి కోసం?’ అనే ప్రశ్న టాటా ఆలోచనల కేంద్రబిందువు. ఆ భేటీ తర్వాత నేను ప్రతి సమావేశంలోనూ ఇదే ప్రశ్నను ముందుగా అడగడం అలవాటు చేసుకున్నాను. ఈ ఒక్క ప్రశ్న నా దృక్పథాన్ని, నాయకత్వాన్ని అర్థం చేసుకునే విధానాన్ని మార్చేసింది.
రద్దు కాని ఆ సమావేశం : ఈ 21 ఏళ్ల అనుబంధంలో ఒక సందర్భం నా మనసులో చెరగని ముద్ర వేసింది. అది 2006 ఫిబ్రవరి 21. ఆ సమావేశానికి ఎనిమిది రోజుల ముందు ఫిబ్రవరి 13న నేను బోస్టన్ నుంచి ముంబైకి వచ్చాను. ఇంటర్‌కాంటినెంటల్ హోటల్ వద్ద జరిగిన ఒక ప్రమాదంలో నేను గాయపడ్డాను. నా కుడి భుజం మూడుచోట్ల విరిగిపోయింది. వైద్యులు శస్త్రచికిత్స చేసి, నా చేతికి కట్టు కట్టారు. అనంతరం నేను హైదరాబాద్‌కు వెళ్లిపోయాను. అయితే, ఫిబ్రవరి 21న రతన్ టాటాతో నాకు ముందుగానే నిర్ణయించిన సమావేశం ఉంది. ఆ సమావేశాన్ని రద్దు చేయాలనే ఆలోచన ఒక్క క్షణం కూడా నాకు రాలేదు. కుడి చేయి కదలకుండా ఉన్న స్థితిలోనే బాంబే హౌస్‌కు వెళ్లాను.
ఆ రోజు నాకు స్పష్టంగా అర్థమైంది. కొన్ని సమావేశాలు వ్యాపార అవసరాల కోసం జరుగుతాయి. కొన్ని బాధ్యతల వల్ల జరుగుతాయి. మరికొన్ని మాత్రం పరస్పర గౌరవం, నిబద్ధత, ఇచ్చిన మాటకు నిలబడాలనే విలువల కారణంగా జరుగుతాయి. రతన్ టాటాతో ఆ భేటీ అలాంటి అరుదైన సమావేశాల్లో ఒకటి. రతన్ టాటాతో సమావేశాన్ని నేను వాయిదా వేయకపోవడం ఆయనను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ విషయాన్ని ఆయన నాతో నేరుగా చెప్పారు కూడా. అయితే, ఆ రోజు సమావేశాన్ని చిరస్మరణీయంగా మార్చింది మాత్రం మరో విషయం.
అవే నేటికీ నా మనసులో మారుమోగుతూనే ఉన్న రతన్ టాటా మాటలు. విరిగిన భుజంతో, చేతికి ప్లాస్టర్‌తో, కోటు ఒక వైపు చేతి భాగం ఖాళీగా వేలాడుతుండటాన్ని రతన్ టాటా గమనించారు. అది చూసి ‘నీ జీవిత లక్ష్యానికి అంకితభావం, దానిపట్ల నీకున్న మక్కువ, వెనుకడుగు వేయని పట్టుదల కలిసొస్తే... అవే నీ ప్రయాణానికి మార్గదర్శకాలు అవుతాయి’ అని ఆయన అన్నారు.
లక్ష్యం, మక్కువ, పట్టుదల.. ఇవి మూడు పదాలు మాత్రమే. అవి గోడలపై రాసుకునే నినాదాలు కావు. ఉద్యోగుల్లో ఉత్సాహం నింపే సూక్తులు కావు. కానీ, రతన్ టాటా వాటిని మరో అర్థంలో చెప్పారు. అవి ఆయన దృష్టిలో కాలపరీక్షను తట్టుకుని నిలిచే సంస్థలకు, మధ్యలోనే కనుమరుగైపోయే సంస్థలకు మధ్య ఉన్న తేడాను వివరించే సూత్రాలు. సమాజానికి శాశ్వత విలువను సృష్టించే వ్యక్తులకు, కేవలం సంపదను కూడబెట్టే వ్యక్తులకు మధ్య ఉన్న భేదాన్ని గుర్తించే ప్రమాణాలు. ఆ రోజు రతన్ టాటా చెప్పిన ఆ మూడు పదాలు... అప్పటి నుంచి నా జీవిత ప్రయాణానికి దిక్సూచిగా మారాయి.
రెండు కీలక ఒప్పందాలు: 2006 జూన్ 30. ముంబైలోని తాజ్ హోటల్ వేదికగా మేమంతా కలిసిన ఆ రోజు నా జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. రతన్ టాటా తన జీవితకాలంలో చాలా అరుదుగా నిర్వహించిన ఉమ్మడి విలేకరుల సమావేశాల్లో అది ఒకటి. ఆ రోజు రెండు కీలకమైన ఒప్పందాలు జరిగాయి. మొదటిది, ఇండిజీన్ ఫార్మాస్యూటికల్స్, టాటా గ్రూప్ మధ్య ఏర్పడిన వ్యూహాత్మక భాగస్వామ్యం. అదే సమయంలో, ఇండిజీన్ ఫార్మాస్యూటికల్స్, భారత శాస్త్రపారిశ్రామిక పరిశోధనా మండలి మధ్య మరో వ్యూహాత్మక ఒప్పందం కూడా కుదిరింది. అయితే, వెనక్కి తిరిగి చూసినప్పుడు నాకు అనిపించేది ఒక్కటే. ఆ రోజు ప్రజల ముందుకువచ్చింది కేవలం రెండు సంస్థల భాగస్వామ్యం కాదు, అది ఒక ఆలోచనకు లభించిన గుర్తింపు.
మేధోనిజాయితీయే అసలైన పునాది: బోర్డు రూముల్లోని అనేక అనుభవాల్లో ఒకటి ఇప్పటికీ నా జ్ఞాపకాలలో స్పష్టంగా నిలిచిపోయింది. అది 2007 జూన్ నెల. ఆ రోజు టాటా సన్స్ డైరెక్టర్ల సమక్షంలో నేను అమెరికాలో ఇండిజీన్ విస్తరణ వ్యూహాన్ని వివరిస్తున్నాను. అయితే, తాము అప్పటికే సాధించిన వృద్ధిని నిలబెట్టుకోవాలంటే అవసరమయ్యే మార్కెటింగ్ వ్యయాన్ని నేను తక్కువగా అంచనా వేస్తున్నానని టాటా సన్స్ కార్యనిర్వాహక సంచాలకుడు ఆర్ గోపాలకృష్ణన్ మధ్యలో కలుగజేసుకొని చెప్పారు.
నా లెక్కలు ఆశావహంగా ఉన్నప్పటికీ, మార్కెట్ వాస్తవాలు మరింత ఎక్కువ పెట్టుబడులను కోరుకుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. రతన్ టాటా కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే, ఆ సమయంలో నా విశ్లేషణ సరైందేనని నేను నమ్మాను. కానీ, 2008 నాటికి ఆర్. గోపాలకృష్ణన్ చెప్పిందే నిజమైంది.
ఆ అనుభవం నాకు మరో గొప్ప పాఠాన్ని నేర్పింది. నిజమైన బోర్డు రూములు కేవలం ఆమోద ముద్రలు వేసే వేదికలు కావు. అక్కడ భిన్నాభిప్రాయాలకు స్థానం ఉండాలి. కఠినమైన ప్రశ్నలు అడగాలి. అవసరమైతే తప్పులను ఎత్తిచూపాలి. అంతకంటే ముఖ్యంగా, తప్పు చేశామని అంగీకరించే మేధోనిజాయితీ ఉండాలి. అయి తే, నా మనసులో నిలిచిపోయింది నేను తప్పు చేశాననే భావన కాదు, ఆ తప్పు జరిగిన సందర్భంలోని సంస్కృతి. ఆ బోర్డు రూములో తప్పును అవమానంగా భావించేవారు కాదు. ఆ సంస్కృతిని నిర్మించింది రతన్ టాటాయే.
దాతృత్వం ఒక దృక్పథం: కాలక్రమేణా మా సమావేశాలు వ్యాపార విషయాలకు మాత్రమే పరిమితం కాలేదు. రతన్ టాటా తరచూ టాటా ట్రస్టుల గురించి మాట్లాడేవారు. అయితే, నన్ను ఎక్కువగా ప్రభావితం చేసింది ఆ దాతృత్వ కార్యక్రమాల వెనుక ఉన్న తత్వం.
వెంట తీసుకెళ్తున్న వారసత్వం: 2024 అక్టోబర్ 9న రతన్ టాటా కన్నుమూశారు. అప్పుడు ఆయన వయసు 86 సంవత్సరాలు. ఆయన మరణవార్తపై ప్రపంచం స్పందించిన తీరు ఆయన వ్యక్తిత్వానికి అద్దం పట్టింది. భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది, ఈ ప్రపంచానికి నిజాయితీగా మేలు చేయడానికి ప్రయత్నించిన ఒక మనిషి ఇక లేరనే భావనతో వ్యక్తం చేసిన గౌరవప్రదమైన నివాళి అది.
అయితే, 2003లో రెండున్నర గంటల పాటు సాగిన తొలి సమావేశంతో మొదలై, ఆయన మరణించిన అక్టోబర్ వరకు ఏదో ఒక రూపంలో కొనసాగిన స్నేహబంధం ద్వారా ఆయన గురించి దగ్గరగా తెలుసుకునే అవకాశం నాకు లభించింది. ఈ క్రమంలో ఆయనలోని జిజ్ఞాసను చూశాను. సూటిగా మాట్లాడే స్వభావాన్ని చూశాను. అంతకంటే అరుదైన మరో లక్షణం.. ఎప్పటికీ మరచిపోలేని నాయకత్వాన్ని కూడా చూశాను. అన్నిటికంటే ముఖ్యంగా, రతన్ టాటా నాకు అందించిన మూడు పదాలు లక్ష్యం, మక్కువ, పట్టుదలను ఆయనలో చూశాను.
హైదరాబాద్ నుంచి బోస్టన్, అక్కడి నుంచి బాంబే హౌస్ వరకు సాగిన నా ప్రయాణం శాస్త్ర విజ్ఞానంతో రూపుదిద్దుకుంది. పారిశ్రామికవేత్తగా ఎదురైన అనుభవాలతో మరింత పదు నెక్కింది. ఏ వ్యాపారమైనా, ఏ సంస్థ అయినా అంతిమం గా మనుషుల సేవకే అంకితమవ్వాలనే విశ్వాసంతో అర్థవంతమైంది. ఆ విశ్వాసానికి రతన్ టాటా మరింత స్పష్టత ఇచ్చారు. దానికి ఒక ప్రమాణాన్ని నిర్దేశించారు. అదే రతన్ టాటా నాకు నేర్పిన గొప్ప పాఠం. అదే నేను ఇప్పటికీ నిర్మించడానికి ప్రయత్నిస్తున్న వారసత్వం.
వ్యాసకర్త: హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ఎం వామన్‌రావు బోస్టన్‌లో స్థిరపడిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త. అనేక పరిశోధనలు చేసిన ఆయన అమెరికాలో పలు పేటెంట్లను కూడా పొందారు. ప్రస్తుతం ఏఐ, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో తన కృషిని కొనసాగిస్తున్నారు.






