చెత్త వేసే ప్రదేశాలను శుభ్రం చేయించి, ఫ్లెక్సీల ఏర్పాటు
దమ్మపేట, మార్చి 23 (విజయక్రాంతి): దమ్మపేట మండల కేంద్రంలో చెత్త వేసే ప్రదేశాలను గుర్తించి జేసీబీ సహాయంతో శుభ్రం చేయించి చెత్తను ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డ్ కి తరలించారు, ఆ స్థలాల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించే విధంగా ఫ్లెక్సీలను పంచాయతీ సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు, కార్యదర్శి బండి అనంత కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
చెత్త వేసే ప్రదేశాలలో చుట్టు ప్రక్కల నివాసం ఉండే ప్రజలను పిలిపించి పరిసరాల పరిశుభ్రత గురించి వివరించి, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వెయ్యకుండా బాధ్యత వహించి దమ్మపేట గ్రామ పంచాయతీకి సహకరించాలని తెలియజేశారు.
రోడ్లు, కాలువలు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకూడదని హెచ్చరిస్తూ, ‘ఇక్కడ చెత్త వేయరాదు‘ అనే ఫ్లెక్సీలలో వ్రాయించి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం వలన దుర్గంధం, వ్యాధులు వ్యాపిస్తాయనీ, రూ.500/- వరకు చెత్త వేసే వారికి జరిమానా అని వివరంగా తెలియజేసి, చెత్త వేసే ప్రదేశాల స్థల యజమానులకు ఎత్తుపాటి లింక్డ్ మెష్ ఏర్పాటు చేయాలి అని, ప్రజల్లో అవగాహన పెరిగి, రోడ్ల పై వేసే చెత్తను వెయ్యకుండా పంచాయతీ ట్రాక్టర్లలో వేసే విధంగా అవగాహన కల్గించారు.
తదనంతరం బంజారా కాలనీ చెరువు కట్టకు వెళ్ళే మార్గంలో డ్రైనేజ్ లను పూడిక తీసే పనులను పరిశీలించారు. బంజారా కాలనీ లో మంచినీటి సరఫరా చేసే పైపుల డ్యామేజ్ ను గుర్తించి పైపుకు ప్యాచీ వేసే స్థలమును పరిశీలించారు. శిథిలాస్థితిలో ఉన్న ఇండ్ల పరిసరాలను శుభ్రం చేయించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు, వార్డు సభ్యులు పానుగంటి లక్ష్మణ్ గౌడ్, దారా రాము, ఉయ్యాల లక్ష్మీనారాయణ, రూపా రాంబాబు, బత్తుల సాయి, దాసరోజు సరిత రామారావు, బద్దె వెంకటలీల, పసుమర్తి కుసుమాంబ, గ్రామస్తులు ధర్మాసోతు నరేష్, పగడాల గోపి, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




