స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో ప్రక్షాళన
- శాస్త్రీయ పద్ధతిలో భూముల ధరలను సవరించాలి
- 2013 కంటే ముందున్న పద్ధ్దతులను పాటించాలి
- సకల వసతులతో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణం
- రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 5 (విజయక్రాంతి): పేద, మధ్యతరగతి ప్రజలపై భారం పడకుండా రాష్ట్రంలో భూముల విలువలను పెంచాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత మార్కెట్ విలువలకు అనుగుణంగా భూముల ధరలను శాస్త్రీయ పద్ధతిలో సవరించాలన్నారు. అధికారులతో శుక్రవారం సచివాలయంలోని తన కార్యాలయంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, ఐజీ జ్యోతి బుద్ధ ప్రకాశ్‌తో కలిసి భూముల విలువల పెంపుతో పాటు పలు అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్‌తో పాటు రాష్ర్టంలో ఉన్న భూముల ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో దానికి అనుగుణంగా భూముల ధరలను సవరించాలన్నారు. బహిరంగ మార్కెట్ విలువలకు, ధరలకు భారీగా వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో విమర్శలకు తావు లేకుండా శాస్త్రీయ పద్ధతిలో సవరించాలన్నారు. అయితే ఏఏ ప్రాంతాలలో ఎక్కువ వ్యత్యాసం ఉంది, అక్కడ హేతుబద్ధంగా ఎంత శాతం పెంచేందుకు అవకాశముందో అధికారులు క్షేత్రస్థాయిలో లోతైన అధ్యయనం చేయాలన్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువ కంటే, ప్రభుత్వ ధర అధికంగా ఉందని అక్కడ తగ్గించాలన్నారు.
పారదర్శకంగా బదిలీలు
ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పనితీరు ఆధారంగా పారదర్శకంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను బదిలీ చేస్తామని మంత్రి తెలిపారు. అధికారి నుంచి ఆఫీసు సబార్డినేట్ వరకు ప్రక్షాళన చేస్తామని, ఇందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. చట్టంలో లొసుగులకు శాశ్వతంగా ముగింపు పలికేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రస్తుతం కొడంగల్, వల్లభనగర్, సరూర్‌నగర్, మంచిర్యాల, హుస్నాబాద్ వంటి ప్రాంతాలలోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాలు ఉన్నాయని, రాష్ట్రవ్యాప్తంగా అద్దెభవనాల్లోనే రిజిస్ట్రేషన్ కార్యాలయాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ర్టవ్యాప్తంగా సకల వసతులతో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మిస్తామని మంత్రి తెలిపారు. ఇందుకోసం అవసరమైన భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్లకు టైమ్‌స్లాట్ అంశాన్ని పరిశీలించాలని సూచించారు. పనిభారం అధికంగా ఉన్న సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్రత్యామ్నాయం చూడాలన్నారు.






