24 May, 2026 | 3:24 AM

ఇరాన్ గగనతలం మూసివేత

24-05-2026 01:11 AM

అమెరికా వార్ హెచ్చరికలతో ఐఆర్‌జీసీ అప్రమత్తం

25 వరకు మూసివేత

టెహ్రాన్, మే 23: అమెరికా మళ్లీ దాడులు చేయొచ్చనే హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది. దేశ పశ్చిమప్రాంతంలో గగనతలాన్ని సోమవారం వరకు మూసివేస్తూ నోటామ్(నోటీస్ టూ ఎయిర్మెన్)ను శుక్రవారం జారీ చేసింది. ఈ పరిణామంతో గల్ఫ్‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

అమెరికా మరోసారి యుద్ధాన్ని ప్రారంభిస్తే దీటుగా ఎదుర్కొనేందుకు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్(ఐఆర్‌జీసీ), ఇతర సాయుధ దళాలు సిద్ధమవుతున్నట్టు ఇరాన్ వార్తా సంస్థ తస్నీమ్ ఒక కథనాన్ని ప్రచురించింది. దీంతో పశ్చిమ ప్రాంతం వైపు ఉన్న గగనతలాన్ని మూసివేసినట్లు ఇరాన్ పౌరవిమానయాన సంస్థ ఎయిర్‌లైన్లకు నోటమ్ జారీ చేసింది. ఈ నెల 25 వరకు అన్ని విమానాల రాకపోకలను నిలిపేస్తున్నట్లు పేర్కొంది. అమెరికా మళ్లీ వార్ మొదలు పెడితే.. ఆ దేశ ఆస్తులకు నష్టం కలిగేలా, ప్రయోజనాలు దెబ్బతినేలా దాడులకు ప్రణాళికలను ఇరాన్ మిలిటరీ సిద్ధం చేసినట్టు సమాచారం.

ఈ వారాంతాన్ని న్యూజెర్సీలో గడపాల్సిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరి నిమిషంలో తన ప్లాన్‌ను అకస్మాత్తుగా రద్దు చేసుకుని రాజధాని వాషింగ్టన్‌కు తిరిగొచ్చారు. దీంతో, శ్చిమాసియాలో మళ్లీ ఘర్షణలు మొదలవుతాయన్న వార్తలు మీడియాలో వెలువడ్డాయి. ఈ వారాంతంలో మెమోరియల్ డే వేడుకల్లో పాల్గొనాల్సిన అమెరికా నిఘా సంస్థల సీనియర్ అధికారులు కూడా తమ ప్రణాళికలను రద్దు చేసుకుని వాషింగ్టన్‌కు వచ్చేశారు. రాబో యే 24 గంటల్లో ఇరాన్, అమెరికా మధ్య దౌత్య చర్చలు విఫలమైతే దాడులు చేసేందుకు ట్రంప్ కూడా రెడీగా ఉన్నట్లు సమాచారం. దీంతో పశ్చిమాసియాలో ఏ క్షణాన ఏం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది.