calender_icon.png 21 July, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇజ్రాయెల్‌పై క్లస్టర్ బాంబు

21-06-2025 01:09:50 AM

యుద్ధం 8వ రోజు

  1. టెల్ అవీవ్ సహా పలు ప్రాంతాలపై ప్రయోగించిన ఇరాన్
  2. 60 ఫైటర్ జెట్లతో నిప్పుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్
  3. ఇరాన్‌లో 639 మంది.. ఇజ్రాయెల్‌లో 25 మంది మృతి
  4. ఇక ఇరాన్ అణు స్థావరాలపై దాడి: నెతన్యాహు

టెహ్రాన్/టెల్ అవీవ్, జూన్ 20: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరింత ముదిరింది. యుద్ధం మొదలైన ఎనిమిది రోజుల తర్వాత ఇరాన్ తొలిసారి ఇజ్రాయెల్‌పై ‘క్లస్టర్ బాం బులు’ ప్రయోగించింది. తమపై దాడికి ఇరాన్ క్లస్టర్ బాంబులను ఉపయోగించిందని ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) ఆరోపించాయి. ఇరాన్ ప్రయోగించిన క్లస్టర్ బాంబు.. సెంట్రల్ ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకొని 7 కిలోమీటర్ల ఎత్తులో పేలి 20 చిన్న మందుగుండు సామగ్రిగా విడిపోయి 8 కిలోమీటర్ల మేర పరిధిలో చిన్న చిన్న ముక్కలుగా ఎగిరిపడ్డాయి.

ఈ క్షిపణుల్లో ఒకటి అజోర్ ప్రాంతంలోని నివాస సముదాయాల్లో పడింది. అయితే దీని కారణంగా పెద్దగా ప్రాణనష్టం జరగలేదని.. గాయపడిన వారి సంఖ్య స్వల్పంగానే ఉందని ఇజ్రాయె ల్ సైన్యం పేర్కొంది  ఇరాన్ ‘క్లస్టర్ బాంబు’ దాడికి ఇజ్రాయెల్ దీటుగా సమాధానమిచ్చింది.

ఇరాన్‌లోని సైనిక స్థావరాలు, అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ 60 ఫైటర్ జెట్ యుద్ధ విమానాలతో నిప్పులు చెరిగింది. ముఖ్యంగా అణు కార్యాకలా పాలతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న డిఫెన్సివ్ ఇన్నో వేషన్ అండ్ రీసెర్చీ సంస్థ (ఎస్పీఎన్‌డీ) ప్రధాన కార్యాలయంపై బాంబు ల వర్షం కురిపించింది. టెహ్రాన్  కేంద్రంగా 120 శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది.

దాడుల్లో టెహ్రాన్‌లోని సైనిక పారిశ్రామిక ప్రాంతాలు, రాకెట్ ఇంజన్ల తయారీకి ఉపయోగించే ముడి పదార్థాల ఉత్పత్తి కేంద్రాలు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్‌లో ఇప్పటివరకు 639 మందికి పైగా మరణించగా.. గాయపడిన వారి సంఖ్య 1300 దాటింది. మరోవైపు ఇజ్రాయెల్ అధికారిక లెక్కల ప్రకారం 25 మంది మృతి చెందగా.. 600 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది.

గురువారం ఇజ్రాయెల్‌లోని సొరోకా ఆసుపత్రిపై ఇరాన్ చేసిన దాడికి ఇది ప్రతీకార చర్య అని.. ఇరాన్‌లోని అణు స్థావరాలపై దాడులు చేసేందుకు అమెరికా అను మతి కోసం వేచి చూడలేమని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. మరోవైపు అమెరికాతో ఎలాంటి అణు ఒప్పంద చర్చలు జరిపేది లేదని ఇరాన్ తేల్చి చెప్పింది.

అణు ఒప్పందంపై ఇరాన్ చర్చలకు రాని పక్షంలో రెండు వారాల్లోగా దాడులపై నిర్ణ యం తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన మరుసటి రోజే ఇరాన్ ఈ వ్యాఖ్యలు చేయ డం గమనార్హం. కాగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మాజిద్ ఖాదే మిని నియమించింది.

ఇజ్రాయెల్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్.. భారత్ కోసం ప్రత్యేక మినహాయింపు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇరాన్ గగనతలం తెరుచుకోవడంతో ‘ఆపరేషన్ సింధు’ పేరిట కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలో భాగం గా తొలి విడత భారత విద్యార్థుల బృందం శుక్రవారం రాత్రి ప్రత్యేక విమానంలో నేరుగా ఇరాన్ నుంచే ఢిల్లీకి చేరుకుంది. కాగా ఇప్పటికే ఇరాన్ నుంచి ఆర్మేనియా మీదుగా 110 మంది విద్యార్థులు భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇజ్రాయెల్ దాడుల్లో ఎస్పీఎన్‌డీ ధ్వంసం

ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్‌లోని అణు కార్యాకలపాలతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న డిఫెన్సివ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ సంస్థ (ఎస్పీఎన్‌డీ) పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తోంది.  ఇరాన్ సైనిక సామర్థ్యానికి అవసర మైన అధునాతన సాంకేతికతలు, ఆయుధాల పరిశోధన, అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తోంది. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమ రూపశిల్పిగా పేరుగాంచిన ఫఖ్రి జాదే 2011లో ఈ సంస్థను స్థాపించారు.

అమెరికా కోసం ఎదురుచూడలేం: నెతన్యాహు

ఇరాన్‌లోని అణు కేంద్రాలన్నింటినీ ధ్వంసం చేసే సామర్థ్యం తమ దేశానికి ఉందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. ఫోర్డ్‌లోని భూగర్భ అణు కేంద్రంతో సహా ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలపై దాడి చేయనున్నట్టు తెలిపారు. అయితే ఇందుకు అమెరికా నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేవరకు వేచి ఉండబోమని స్పష్టం చేశారు. ఇప్పటివరకు నిర్వహించిన దాడుల విషయంలో కూడా యూఎస్ ఆదేశాల కోసం వేచి చూడలేదన్నారు.

ఏమిటీ క్లస్టర్ బాంబు?

ఇజ్రాయెల్‌పై ప్రయోగించిన క్లస్టర్ బాంబు అనేది ఒక విస్తారమైన ప్రాంతంలో అనేక చిన్న బాంబులను (సబ్‌మ్యునిషన్స్) విడుదల చేయడానికి రూపొందించిన ఆయుధం. ఇది ఒక పెద్ద పేలుడుకు దబులుగా గాలిలోనే ఎక్కువ ఎత్తులో తెరుచుకొని లక్షిత ప్రదేశం అంతటా అనేక చిన్న పేలుడు పదార్థాలను వెదజల్లుతుంది. ఈ సబ్‌మ్యునిషన్స్‌కు నిర్దేశిత లక్ష్యం ఉండదు. భూమిపై పడిన వెంటనే పేలేలా రూపొందిస్తారు.

అయితే క్లస్టర్ బాంబులు ప్రయోగించడంపై నిషేధముంది. 2008లో 111 దేశాలతో సహా 12 ఇతర సంస్థలు క్లస్టర్ బాంబుల ఉత్పత్తి, నిల్వ, బదిలీ, వాడకంపై అంతర్జాతీయంగా నిషేధించినట్టు తెలిపే పేపర్లపై సంతకం చేశాయి. అయితే ఇరాన్, ఇజ్రాయెల్ మాత్రం దీనిలో చేరేందుకు నిరాకరించాయి.

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఖమేనీ మూలాలు

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్న ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మూలాలు భారత్‌లోనే ఉన్నాయి. ఆయన పూర్వీకులు ఉత్తర్ ప్రదేశ్‌లోని కింటూర్ గ్రామంలో నివసించేవారు. 1830లో ఖమేనీ తాత అహ్మద్ ఇండియాను విడిచి మొదట ఇరాక్‌కు, ఆ తర్వాత ఇరాన్‌లోని ఖొమేన్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఖమేనీ తండ్రి మొస్తఫా అహ్మద్ కుమారుల్లో ఒకరు. 1979లో ఇస్లామిక్ విప్లవానికి నాయకత్వం వహించిన ఖమేనీ చిత్రాలు ఇరాన్‌లోని స్కూళ్లు, కార్యాలయాలు, కరెన్సీ నోట్లపై కనిపిస్తుంటాయి.

చెర్నోబిల్ తరహా దాడులు జరుగుతాయి: రష్యా

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్దం నేపథ్యంలో రష్యా మరోసారి హెచ్చరికలకు దిగింది. ఇరాన్‌లోని అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులకు పాల్పడితే ‘చెర్నోబిల్’ తరహా దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవ్వాల్సి వస్తోందని రష్యా పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది. వాస్తవానికి ఇరాన్‌లో బుషెహర్ ప్రాంతంలో ఒక అణు విద్యుత్ కేంద్రం ఉంది. టెహ్రాన్ నగరానికి 750 కిలోమీటర్ల దూరంలో ఉంది.

దీని నిర్మాణంలో ఇరాన్‌కు రష్యా సాయమందించింది. రష్యాలో ఉత్తత్పి అయిన యురేనియం ఈ అణు విద్యుత్ కేంద్రానికి ఇందనంగా ఉపయోగపడుతోంది. దాడుల్లో ఇది ఎక్కడ నాశనం అవుతుందో అని రష్యా భయపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్‌ను పరోక్షంగా హెచ్చరించింది. ఇక 1986 ఏప్రిల్ 25న చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.