calender_icon.png 21 June, 2025 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడాదిలోనే మూడింతలు

21-06-2025 01:05:54 AM

స్విస్ బ్యాంకుల్లో పెరిగిన భారతీయుల డబ్బు

* భారత్ నుంచి విదేశాలకు పెద్ద మొత్తంలో తరలివెళ్తున్న బ్లాక్ మనీకి అడ్డుకట్ట వేస్తామని, స్విస్ బ్యాంకుల్లో పేరుకుపోయిన నల్లధనాన్ని దేశానికి తిరిగి తీసుకొచ్చి పేదలకు పంచి పెడుతామని రాజకీయ నాయకులు చెప్పటం పరిపాటే. ఈ మాటలు వినడానికి బాగుంటాయే కానీ ఆచరణలో ఏ మాత్రం సాధ్యం కాదని మరోసారి రుజువైంది. స్విస్ బ్యాంకుల్లో భారతీయులు డిపాజిట్ చేసే నగదు విలువ ఏడాది వ్యవధిలోనే మూడింతలయ్యింది. 2024లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సొమ్ము సుమారు రూ. 37,600 కోట్లకు చేరుకుందని స్విస్ జాతీయ బ్యాంక్ (ఎన్‌ఎన్‌బీ) తమ నివేదికలో పేర్కొంది. 

  1. స్విస్ బ్యాంకుల్లో పెరిగిన భారతీయుల డబ్బు
  2. భారతీయుల సొమ్ము 3.54 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు పెరిగిందన్న స్విస్ జాతీయ బ్యాంకు
  3. నిధుల విలువ పరంగా 48వ ర్యాంకులో భారత్
  4.  అత్యధికంగా యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి నగదు డిపాజిట్లు

న్యూఢిల్లీ, జూన్ 20: స్విస్ బ్యాంకుల్లో భారతీయులు డిపాజిట్లు భారీగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే 2024లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సొమ్ము ఏడాదిలోనే మూడింతలయ్యింది. స్విస్ జాతీయ బ్యాంకు (ఎస్‌ఎన్‌బీ) గురువారం విడుదల చేసిన నివేదికలో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సొమ్ము రేటు మూడు రెట్లు పెరిగి 3.54 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు (సుమారు రూ. 37,600 కోట్లు) చేరుకుందని తెలిపింది.

2021 తర్వాత ఇదే అత్యధికమని, ఇందులో ఎక్కువ భాగం వ్యక్తిగత కస్టమర్ ఖాతాల నుంచి కాకుండా బ్యాంకు చానెల్స్, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా వచ్చాయని ఎస్‌ఎన్‌బీ తెలిపింది. భారతీయ కస్టమర్ల నుంచి నేరుగా జరిగే డిపాజిట్లు 11 శాతం వృద్ధితో 346 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు (సుమారు రూ. 3,675 కోట్లు) చేరుకోవడంతో స్వ ల్పంగా పెరిగినట్లయింది. అయితే ఈ డిపాజిట్లు మొత్తం నిధుల్లో పదో వంతు మాత్రమే.

ఎస్‌ఎన్‌బీ నివేదిక ప్రకారం.. మొత్తం రూ. 37, 600 కోట్లలో ఇతర బ్యాంకుల ద్వారా రూ. 32 వేల కోట్లు, కస్టమర్ ఖాతాలలో రూ. 3,670 కోట్లు, ట్రస్టుల ద్వారా రూ. 435 కోట్లు, బాండ్లు, సెక్యూరిటీల వంటి ఇతర సాధనాలలో రూ. 1432 కోట్లు ఉన్నాయి. స్విస్ జాతీయ బ్యాంకు గణాంకాల ప్రకారం 2023లో భారతీయుల డిపాజిట్లు 70 శాతం తగ్గింది. ఇది నాలుగేళ్ల కనిష్ఠం సుమారు రూ. 1.04 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లుగా ఉంది.

అయితే 2024లో డిపాజిట్లు భారీగా పెరగడం గమనార్హం. 2021 తర్వాత అత్యధిక స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి అని ఎస్‌ఎన్‌బీ నివేదికలో వెల్లడించింది. 2021లో భారతీయుల బ్యాలెన్సు లు 14 ఏళ్ల గరిష్ఠాన్ని తాకుతూ ఏకంగా 3.83 బిలియన్ స్విస్ ఫ్రాంకులకు చేరుకోవడం విశేషం. ఇక ఎస్‌ఎన్‌బీ నివేదిక ప్రకారం కస్టమర్ డిపాజిట్లు 346 మిలియన్ స్విస్ ఫ్రాంకులు, ఇతర బ్యాంకుల ద్వారా 3.02 బిలియన్ స్విస్ ఫ్రాంకులు, ట్రస్ట్, నిధుల ద్వార 41 మిలియన్ స్విస్ ఫ్రాంకులు, బాండ్లు, సెక్యూరిటీ రూపంలో 135 మిలియన్ ఫ్రాంకులు ఉన్నాయి.

2006లో దాదాపు 6.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లతో రికార్డు స్థాయికి చేరుకోగా.. కొన్నేళ్లు మినహా 2011 నుంచి 2023 మధ్య డిపాజిట్లు తగ్గుముఖం పట్టాయి. ఇవన్నీ స్విట్జర్లాండ్ జాతీయ బ్యాంకుకు అక్కడి బ్యాంకులు ఇచ్చిన అధికారిక గణాంకాలు మాత్రమే. భారతీయులు దాచి ఉంటారని భావించే నల్లధనం వివరాలు ఇందులో లేవు. భారతీయులు, ఇతర దేశాల సంస్థల పేర్లతో చేసిన డిపాజిట్లు కూడా వెల్లడించరు.

ప్రపంచవ్యాప్తంగా 48వ ర్యాంకులో

స్విస్ బ్యాంకుల్లో నిధుల పరంగా భారత్ ప్రపంచవ్యాప్తంగా 48వ స్థానానికి చేరకుంది. గత సంవత్సరం 67వ స్థానంలో ఉంది. అయితే ఇది 2022లో  భారత్ స్థానం 46గా ఉండడం గమనార్హం. ఇతర దేశాలకు సంబంధించి పాకిస్థాన్ 272 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు పడిపోయింది. బంగ్లాదేశ్ నిధులు 589 మిలియన్ స్విస్ ఫ్రాంకులకు పెరిగింది.

ప్రపంచవ్యాప్తంగా స్విస్ బ్యాంకుల్లో 222 బిలియన్ స్విస్ ఫ్రాంకులతో యునైటెడ్ కింగ్‌డమ్ అగ్రస్థానంలో ఉండగా.. అమెరికా (89 బిలియన్ స్విస్ ఫ్రాంకులు), వెస్టిండీస్ (68 బిలియన్ స్విస్ ఫ్రాంకులు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జర్మనీ, ఫ్రాన్స్, హాంకాంగ్, లగ్జెంబర్గ్, సింగపూర్, గుర్న్‌సే, యూఏఈ టాప్ చోటు దక్కించుకున్నాయి.