ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట ఇచ్చారని.. ఆ మాట ప్రకారం రైతు పంటల రుణాలు మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించిన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేబినేట్ భేటీలో రుణమాఫీ విధానాలపై చర్చించినట్లు వెల్లడించారు.
వ్యవసాయాన్ని పండుగ చేయడం కాంగ్రెస్ విధానమని, కాంగ్రెస్ మాట ఇస్తే వెనుకడుగు వేయదని చెప్పారు. పార్టీకి నష్టమని తెలిసినా సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ ఇచ్చారని, 2022 మే 6న వరంగల్ సభలో రాహుల్ గాంధీ రుణమాఫీ హామీని ఇచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సోనియా గాంధీ మాట ఇస్తే శిలాశాసనమే అన్నారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో 2014, 2018లో మొత్తం రూ. 28 కోట్లు రుణమాఫీ చేసినట్లు తెలిపారు.
12 డిసెంబర్ 2018 నుంచి 09 డిసెంబర్ 2023 వరకు కటాఫ్ తేదీతా నిర్ణయించి రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ రుణమాఫీ కోసం రూ.31 వేల కోట్లు అవసరమవుతాయని, ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీతో 47 లక్షల మంది రైతులకు రుణవిముక్తి కల్పిస్తామని తెలిపారు. రైతుభరోసా అమలుపై మంత్రివర్గం ఉపసంఘం వేశామని, జూలై 15 లోపు నివేదికను ఇస్తామన్నారు. ఉపసంఘం నివేదిక ప్రకారంగా రైతుభరోసా విధివిధానాలు ఖరారు చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.






