2 August, 2026 | 1:22 PM

సీఎంగా వస్తానని.. ఆరోజే గట్టిగా చెప్పా: చంద్రబాబు

22-06-2024 12:42 PM

అమరావతి: చట్టసభకు రావడం అరుదైన గౌరవమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మనందరిపై ప్రవిత్ర బాధ్యత ఉందని గుర్తుంచుకోవాలని చంద్రబాబు తెలిపారు. సమర్థంగా పనిచేస్తే గౌరవం దానంతట అదే వస్తోందన్నారు. ఎంతో పవిత్రమైన అసెంబ్లీని గత వైసీపీ ప్రభుత్వం దెబ్బతీసిందని గుర్తుచేశారు. 23 మంది గెలిచి అసెంబ్లీకి వస్తే చాలా ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబం గురించి ఇష్టానుసారంగా మాట్లాడారని పేర్కొన్నారు. సభలో తనకు మైకు ఇవ్వకుండా చేసి అవమానపరిచారని తెలిపారు.

సీఎంగానే అసెంబ్లీకి వస్తానని ఆరోజే గట్టిగా చెప్పానని గుర్తుచేశారు. కౌరవ సభకు రాను.. గౌరవసభకే వస్తానని స్పష్టం చేశానన్నారు. రాష్ట్రంలోని ఆడపడుచులకు అవమానించారని, సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టారని మండిపడ్డారు. ప్రజలు అంతా గమనించి.. తనను గౌరవ సభకు పంపారన్నారు. భవిష్యత్తులో ఏ ఆడబిడ్డకు అవమానం జరగకుండా చూడాలన్నారు. తన గౌరవాన్ని కాపాడిన ప్రజానీకానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. మళ్లీ జన్మ ఉంటే తెలుగువాడిగానే పుట్టాలన్నారు. తెలుగుగడ్డ రుణం తీర్చుకోవాలనేదే తన కోరిక అని సీఎం వ్యాఖ్యానించారు.