25 June, 2026 | 2:58 PM

చంద్రబాబు, రేవంత్, నేను చరిత్ర సృష్టిస్తాం: డీకే శివకుమార్

25-06-2026 02:26 PM

 చరిత్ర సృష్టిస్తాం

కర్ణాటక: కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ముగ్గురు ముఖ్యమంత్రులు కార్యక్రమం నిర్వహిస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేర్కొన్నారు. చంద్రబాబు.. దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడని శివకుమార్ కొనియాడారు. ''మేం ముగ్గురు సీఎంలు చరిత్ర రాయం.. చదవం.. చరిత్ర సృష్టిస్తాం'' అని కర్నాటక సీఎం తెలిపారు. అందరం కలిసి సమన్వయంతో పనిచేస్తూ మూడు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తామని DK సూచించారు. సీఆర్ పాటిల్ సమక్షంలో చారిత్రాత్మక తీర్మానం చేశామన్న కర్నాటక సీఎం 3 రాష్ట్రాల రైతులకోసం తీసుకున్న నిర్ణయం ఓ చరిత్ర అన్నారు.

కర్ణాటకలోని హోస్పేట్ లో మూడు రాష్ట్రాల నాయకుల సమక్షంలో జరిగిన ఒక కీలక కార్యక్రమంలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు తెరుచుకున్నాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సీ.ఆర్. పాటిల్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా, నాయకులు వివిధ ద్వారాలను లాంఛనంగా ప్రారంభించారు. కేంద్ర మంత్రి సి.ఆర్. పాటిల్ 17వ ద్వారాన్ని, కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ 18వ ద్వారాన్ని ప్రారంభించారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు 19వ ద్వారాన్ని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 20వ ద్వారాన్ని ప్రారంభించారు.  తుంగభద్ర 19వ గేటు 2024 ఆగస్టులో వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. నిపుణుల కమిటీ పరిశీలించి అన్ని గేట్లు మార్చాలని సూచన చేసింది. దీంతో రూ.51 కోట్ల వ్యయంతో అధికారులు 33 కొత్త గేట్లు ఏర్పాటు చేశారు.