3 రాష్ట్రాల కరువు జిల్లాలకు తుంగభద్ర పరిష్కారం
తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ.. ముహూర్తం ఓ చరిత్ర
3 తరాల సమస్యలకు 33 గేట్లతో పరిష్కారం
కర్ణాటక: మూడు రాష్ట్రాల నాయకుల సమక్షంలో జరిగిన ఒక కీలక కార్యక్రమంలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు గేట్లు తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ.... మనందరి కష్టాలు, సమస్యలు తెలిసిన నాయకుడు చంద్రబాబు అన్నారు. దేశంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేత చంద్రబాబు అని కొనియాడారు. మూడు తరాల సమస్యలను 33 గేట్ల పునరుద్ధరణ పరిష్కరించబోతోందని తెలిపారు. తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ ముహూర్తం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. బళ్లారి, కర్నూలు, అనంతపురం, పాలమూరు సమస్యలు తీరుస్తోందన్నారు. తక్కువ మాట్లాడి ఎక్కువ పనులు చేయడం సీఆర్ పాటిల్ ప్రత్యేకతని రేవంత్ పేర్కొన్నారు.
మూడు రాష్ట్రాల నీటి సమస్యలకు పరిష్కారం లభిస్తోందని ఆశిస్తున్నట్లు రేవంత్ రెడ్డి సూచించారు. నీటి సమస్యలు పరిష్కరించుకోకపోవడం వల్ల సముద్రంలో కలుస్తున్నాయన్నారు. రాజోలిబండకు కేటాయించిన 15 టీఎంసీల్లో తాము నాలుగైదు టీఎంసీలే వాడుకుంటున్నామని రేవంత్ వెల్లడించారు. దాదాపు 10 టీఎంసీల నీరు తెలంగాణకు రావట్లేదన్నారు. రాజోలిబండ సమస్యను సీఆర్ పాటిల్, చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని సీఎం స్పష్టం చేశారు.
చర్చలు కొలిక్కి వచ్చాయి.. కేంద్రమంత్రి పరిష్కారం చూపుతారని విశ్వసిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆర్డీఎస్ ద్వారా రావాల్సిన 15.9 టీఎంసీల్లో ఐదారు టీఎంసీలే వస్తున్నాయని చెప్పారు. దాదాపు పది టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావట్లేదన్నారు. తుంగభద్రలో మట్టి పేరుకుపోవడం, నీటి తరలింపు సమస్యలకు పరిష్కారం చూపాలని కేంద్రమంత్రి కోరారు. శివకుమార్ సూచనతో సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబోతున్నారని హర్షం వ్యక్తం చేశారు. తుంగభద్ర ఒడ్డున చర్చలు చరిత్రలో గొప్ప నిర్ణయంగా మారబోతున్నాయని వివరించారు. ఈ నిర్ణయం అంతరాష్ట్ర జల వివాదాలకు పరిష్కారం చూపుతుందని విశ్వసిస్తున్నామన్నారు.
తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు ప్రారంభం
కర్ణాటకలోని హోసపేటలో మూడు రాష్ట్రాల సీఎంల సమక్షంలో జరిగిన ఒక కీలక కార్యక్రమంలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు ప్రారంభించబడ్డాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సి.ఆర్. పాటిల్ మరియు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా, నాయకులు వివిధ ద్వారాలను లాంఛనంగా ప్రారంభించారు. కేంద్ర మంత్రి సి.ఆర్. పాటిల్ 17వ ద్వారాన్ని, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ 18వ ద్వారాన్ని ప్రారంభించారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు 19వ ద్వారాన్ని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 20వ ద్వారాన్ని ప్రారంభించారు.






