18 July, 2026 | 12:31 AM

నేడు ఘట్‌కేసర్‌లో అందెశ్రీ స్మృతివనానికి సీఎం శంకుస్థాపన

18-07-2026 12:00 AM

ఘనంగా కవి అందెశ్రీ జయంతి వేడుకలు

ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు

ఘట్‌కేసర్, జూలై 17 (విజయక్రాంతి): తెలంగాణ భాషా వైభవానికి ప్రతీకగా నిలిచిన రాష్ట్ర కవి అందెశ్రీ జయంతి సందర్భంగా శనివారం ఘట్ కేసర్ లో  నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.

ఈ సందర్భంగా రూ.3.95 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న అందెశ్రీ స్మృతి వనంకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో శుక్రవారం స్మృతి వనం ప్రాంగణంలో ఏర్పాట్లను మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుదీర్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, జిల్లా కార్యదర్శి మామిండ్ల ముత్యాల యాదవ్, డివిజన్ అధ్యక్షుడు బొక్క ప్రభాకర్ రెడ్డి, పోచారం డివిజన్ అధ్యక్షులు కర్రె రాజేష్ తదితరులు పరిశీలించారు.

కార్యక్రమ వేదిక, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్, ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తోటకూర వజ్రష్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర కవి అందెశ్రీ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందన్నారు.

ముఖ్యమంత్రి పాల్గొనే ఈ కార్యక్రమానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, కవులు, సాహితీవేత్తలు, కళాకారులు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నట్లు తెలిపారు. రూ.3.95 కోట్లతో నిర్మించనున్న ‘అందెశ్రీ స్మృతి వనం’ తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక చరిత్రలో మరో మైలురాయిగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర కవి అందెశ్రీ సాహిత్య వారసత్వాన్ని భావితరాలకు అందించడంతో పాటు తెలంగాణ భాష, సంస్కృతి, సాహిత్య వైభవాన్ని ప్రతిబింబించే కేంద్రంగా ఈ స్మృతి వనం రూపుదిద్దుకోనుందని చెప్పారు.