‘ఈ నామ్’ ఉల్టా పల్టా!
- తక్కువ ధర పెట్టిన వ్యాపారులకు టెండర్ ఖరారు
- విస్మయం వ్యక్తం చేసిన అధికారులు
- మాన్యువల్ పద్ధతితో సమస్యకు పరిష్కారం
కేసముద్రం, జులై 17 (విజయక్రాంతి): అధిక ధర ఖరారు చేసిన వ్యాపారికి కాకుండా తక్కువ ధర చేసిన వ్యాపారికి పసుపు పంట ఉత్పత్తులను కేటాయించడంతో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ఈ నామ్ విధానం ఉల్టా పల్టాగా మారింది.మార్కెట్ కు శుక్రవారం పలువురు రైతులు పసుపు పంట ఉత్పత్తులను విక్రయించడానికి తెచ్చారు. పంట ఉత్పత్తుల నాణ్యత పరిశీలించిన వ్యాపారులు రహస్యంగా ఈ నామ్ విధానంలో కొనుగోలు చేసేందుకు ధరలు ఖరారు చేశారు.
మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మార్కెట్ అధికారులు టెండర్లు ఓపెన్ చేయగా, అధిక ధర నిర్ణయించిన వ్యాపారులకు కాకుండా, తక్కువ ధర నిర్ణయించిన వ్యాపారికి 19 పసుపు లాట్లను కేటాయించినట్లు గుర్తించారు. వెంటనే మొత్తం టెండర్ల ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించి, తక్కువ ధరకు కేటాయించిన 19 పసుపు లాట్లను అధిక ధర ఖరారు చేసిన వ్యాపారులకు తిరిగి మ్యానువల్ విధానంలో కేటాయించి సమస్యను తాత్కాలికంగా పరిష్కరించారు.
రైతులు పండించిన పంట ఉత్పత్తులకు నాణ్యమైన ధర లభించడానికి ఆధునిక ఎలక్ట్రానిక్ వ్యవసాయ మార్కెటింగ్ విధానం ఈ నామ్ కేసముద్రం మార్కెట్‌లో అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆన్‌లైన్ విధానంలో ఇలా అధిక ధర పెట్టిన వ్యాపారికి కాకుండా తక్కువ ధర పెట్టిన వ్యాపారికి లాట్లు కేటాయించడంతో మార్కెట్ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయాన్ని ఈ నామ్ విధానాన్ని పర్యవేక్షిస్తున్న సాంకేతిక సంస్థకు ఫిర్యాదు చేసినట్లు మార్కెట్ గ్రేడర్ రాజా తెలిపారు. సాంకేతిక కారణంతో అలా జరిగిందని, సర్వర్‌లో జరిగిన లోపాన్ని సరి చేస్తున్నట్టు సంస్థ ప్రతినిధులు తమకు చెప్పినట్టు ఆయన తెలిపారు.






