18 July, 2026 | 12:25 AM

ఆరోగ్య కేంద్రాలకు అనారోగ్యం

18-07-2026 12:25 AM
  1. అసంపూర్తి నిర్మాణాలు 
  2. వినియోగానికి దూరంగా వైద్యశాలలు 

మహబూబాబాద్, జులై 17 (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీ హెచ్ సీ), ఆరోగ్య ఉప కేంద్రాల (సబ్ సెంటర్) నిర్మాణాలు చేపట్టింది. అయితే మహబూబాబాద్ జిల్లాలో అనేక చోట్ల భవనాలు పూర్తయినా విద్యుత్, తాగునీరు, ప్రహరీ గోడ, ర్యాంపులు, మరుగుదొడ్లు, అంతర్గత ఫినిషింగ్ వంటి చిన్న చిన్న పనులు పూర్తి చేయక నెలల తరబడి తాళాలు వేసి ఉంచుతున్నారు.

మరోవైపు కొన్ని చోట్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతుండటంతో గ్రామీణ ప్రజలు ఇప్పటికీ పాత, శిథిలావస్థలో ఉన్న భవనాల్లోనే వైద్య సేవలు పొందాల్సిన పరిస్థితి నెలకొంది. కొత్త భవనాలు సిద్ధంగా ఉన్నప్పటికీ వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడంతో ప్రభుత్వం చేసిన ఖర్చు  నిరుపయోగంగా మారుతోంది. పాత భవనాల్లో స్థలాభావం, తగిన సౌకర్యాల లేమితో వైద్య సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, రోగులు కూడా అసౌకర్యానికి గురవుతున్నారు.

చిన్న పనులే పెద్ద అడ్డంకిగా.. 

చాలా కేంద్రాల్లో భవన నిర్మాణం 95 శాతం పూర్తయినా కొద్ది పాటి పనులు అసంపూర్తిగా ఉండడంతో, వినియోగానికి దూరంగా ఉన్నాయి.  కొద్దిపాటి నిధులు విడుదల చేయకపోవడం లేదా అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా కోట్ల విలువైన భవనాలు ఖాళీగా ఉండిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో నిర్మాణం పూర్తి చేసినప్పటికీ భవనాలు ప్రస్తుతం నిరాదరణకు గురై శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. 

నత్తనడకన నిర్మాణాలు

కొన్ని ప్రాంతాల్లో పనులు ప్రారంభమై నెలలు, కొన్నిచోట్ల సంవత్సరాలు గడిచినా ఇంకా పూర్తి కాలేదు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, నిధుల విడుదలలో జాప్యం, పర్యవేక్షణ లోపం వల్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రజలు కొత్త భవనాల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో సమయానికి చికిత్స అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.

ప్రభుత్వ లక్ష్యానికి దెబ్బ

గ్రామీణ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలనే ప్రభుత్వ లక్ష్యం అమలులో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల దెబ్బతింటోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసంపూర్తి పనులను పూర్తి చేసి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని, అప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.

చేపట్టాల్సిన చర్యలు

నిర్మాణాలు పూర్తయిన వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలలి. పెండింగ్ పనులకు ప్రత్యేక నిధులు విడుదల చేసి వేగంగా పూర్తి చేయాలి. అసంపూర్తిగా ఉన్న చిన్న పనులను తక్షణమే పూర్తి చేయాలి. నత్తనడకన సాగుతున్న నిర్మాణాలను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలి. ఖాళీగా ఉన్న కొత్త భవనాలను వెంటనే ప్రజలకు అందుబాటులోకి తేవాలి. నిర్మాణాలపై జిల్లా స్థాయి ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలి. గ్రామీణ ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలి. 

అనాథలకు ఆశ్రయంగా ఇంటికన్నె సబ్ సెంటర్

లక్షల రూపాయలు వెచ్చించి అనేక సంవత్సరాల క్రితం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామంలో నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్ అనాధలకు ఆశ్రయంగా మారింది. గ్రామానికి చెందిన అనేకమంది నిలువ నీడలేని నిర్వాసితులు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు ఎవరైనా చనిపోతే వారికి స్వగ్రామములో నిలువ నీడ లేక ప్రస్తుతం ఖాళీగా ఉన్న హెల్త్ సబ్ సెంటర్ను ఆశ్రయంగా చేసుకొని దశదినకర్మను పూర్తయ్యేంతవరకు అందులో నివాసం ఉంటున్నట్లు గ్రామస్తులు చెప్పారు.

చాలా ఏళ్ల క్రితం భవనం నిర్మించినప్పటికీ కొద్దిపాటి పనులు చేపట్టకుండా వదిలేయడంతో అనాధలకు ఆశ్రయం కల్పిస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం శిధిలమైన గ్రామపంచాయతీ భవనంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది హెల్త్ సబ్ సెంటర్ ను నిర్వహించడం కోసం మెరుపుగా నిలుస్తోంది.