కీరవాణి స్టూడియోకు సీఎం
రాష్ట్ర గీతానికి బాణీల పరిశీలన
తెలంగాణ గీతంగా జయ జయహే తెలంగాణ
జూన్ 2న సోనియా చేతుల మీదుగా ఆవిష్కరణ
హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్టూడియోను సందర్శించారు. రాయదుర్గంలోని కీరవాణి స్టూడియోకు వెళ్లి తెలంగాణ గీతం ‘జయజయహే తెలంగాణ’కు బాణీలు కూర్చే విధానాన్ని పరిశీలించారు. ఈ గీతానికి బాణీల మార్పులు, చేర్పులపై కీరవాణితో సమాలోచనలు చేశారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ఈ గీతాన్ని కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ చేతుల మీదుగా విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
అందుకే వీలైనంత త్వరగా పాటకు ఫైనల్ మిక్సింగ్ చేయాలని కీరవాణి భావిస్తున్నారు. ఈ పాటను ప్రముఖ ప్రజాకవి అందెశ్రీ 2003లోనే రాసిన సంగతి తెలిసిందే. ముందు నాలుగు చరణాలతో పాట రాసిన అందెశ్రీ 2009 నాటికి పూర్తి పాటను రూపొందించారు. అప్పటి నుంచి తెలంగాణవ్యాప్తంగా ఈ గీతం విశేష ప్రజాదరణ పొందింది. గీతంలో స్వల్ప మార్పులు.. చేర్పుల్లో భాగంగా జిల్లాల ప్రస్తావనతో పాటు మరికొన్ని అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.
సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో కలిసి వెళ్లిన రేవంత్‌రెడ్డి పాటను ఒకటికి రెండుసార్లు విని అందులోని అంశాలపై చర్చించినట్టు సమాచారం. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండటంతో పది జిల్లాలు అన్న పదాన్ని తొలగించి పదపద అన్న పదాన్ని చేర్చినట్లు తెలిసింది. అయితే తెలంగాణ గీతానికి కీరవాణితో బాణీలు కట్టించటం ఏమిటని తెలంగాణ సినీ మ్యుజీషియన్స్ సంఘం (టీసీఎంఏ) అభ్యంతరం తెలుపుతున్నది. ప్రభుత్వం మాత్రం అవేవీ పట్టించుకోవటంలేదు.






