స్థానిక సంగ్రామంపై గులాబీల కన్ను!
పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు
ఎంత ఖర్చుయిన భయపడేది లేదంటూ సవాళ్లు
హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి) : రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల పోరు ముగియడంతో పల్లెల్లో సర్పంచుల ఎన్నికల వేడి మొదలవుతోంది. జూన్‌లో నోటిఫికేషన్ వస్తుందనే ప్రచారంతో ప్రధాన పార్టీల స్థానిక నేతలు పోటీకి సర్దుకుంటున్నారు. ఈసారి సర్పంచ్‌గా గెలిచి తన సత్తా ఏమిటో నిరూపించుకోవాలని ఉబలాటపడుతు న్నారు. ముందుగా బీఆర్‌ఎస్ ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆస్తిపాస్తులు పోగేసుకున్నవారు.. ఎంత ఖర్చయిన పర్వాలేదనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలోని 32 జిల్లాల్లో 12, 769 పంచాయతీలు ఉండగా వాటికి రెండు పర్యాయాలు ఒకే రిజర్వేషన్ విధానం తీసుకొచ్చింది. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని బీఆర్‌ఎస్ గ్రామ స్థాయి నాయకులు ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. కేసీఆర్ పాలన సమయంలో పింఛన్లు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబందు పథకాలను తాము మంజూరు చేయించిన వారిని గుర్తించి, వారితో సమావేశాలు నిర్వహించి, సర్పంచ్‌గా గెలిపించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.
ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకే పార్లమెంటు ఎన్నికలు రావడంతో పథకాలు ప్రజలకు పూర్తిస్థాయిలో ఇవ్వలేక పోయారు. దీనికి తోడు గతంలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఆర్థికంగా నష్టపోవడంతో వారు గులాబీ నేతలను ఢీకొట్టడంపై వెనకడుగు వేస్తున్నారు. పల్లెలో నగదు, మద్యం పంపిణీతో పాటు ఇతర నజరానాలు ఇస్తేనే ఓటర్లు మొగ్గు చూపుతారు. అలాంటివేమీ లేకుండా పోటీ చేయాలంటే సాధ్యంకాదని కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల జరిగిన పార్లమెంటు ఆరునెలల తరువాత పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే.. ఈ లోగా కొంత ఆర్ధికంగా ఎదగడంతో పాటు ప్రజలకు పథకాలు అందించే అవకాశం ఉందని, తద్వారా ఆదరణ పెరిగి, విజయానికి అవకాశాలు ఏర్పడుతాయనే భావిస్తున్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు మార్చాలని కాంగ్రెస్ నాయకులు మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. గత పాలకుల విధానం అమలు చేస్తే తాము పోటీ చేయడం కష్టమని పేర్కొన్నట్లు తెలిసింది. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పడు వారికి అనుకూలమైన విధానం చేసుకున్నారని, అది మనకు అనుకూలించదని, రిజర్వేషన్లు పెంచి నోటిఫికేషన్ వేయాలని కోరినట్లు సమాచారం.






