నా కల నెరవేరింది: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మంగళవారం చిట్ చాట్ నిర్వహించారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కొనసాగుతోందని సీఎం పేర్కొన్నారు. విచారణ విషయంలో కక్షసాధింపు ఉండదని, దానిపై దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగానే చర్యలు ఉంటాయన్నారు. రాజకీయంగా నష్టం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు చేయాలనుకున్న మేలు చేసి తీరతామన్నారు. ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న తన కల నెరవేరిందని, ఈ పదవి కంటే పెద్ద కలలు తనకు వేరే ఏమీలేవు అని రేవంత్ చెప్పారు. మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీటిని మూసీకి తరలించేందుకు నవంబర్ లో టెండర్లు వేయనున్నట్లు ఆయన వెల్లడించారు. మూసీ అభివృద్ధి అధ్యయనానికి నగర ప్రజాప్రతినిధులను పంపుతామని ముఖ్యమంత్రి చెప్పారు.
నగర ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లను సియోల్ కు పంపుతామన్నారు. కావలనే మూసీ పునరుజ్జీవంపై చర్చకు తెరలేపామని, ఈ చర్యలతో ప్రజలకు అవగాహన కలిగిందన్నారు. మూసీని బాగు చేసేవాడొకడు వచ్చాడని ప్రజలకు అప్పుడు తెలుస్తుందని సీఎం వివరించారు. తను పుట్ బాల్ ప్లేయర్ ని.. గేమ్ ప్లాన్ పై తనకు స్పష్టత ఉందన్నారు. 55 కిలోమీటర్ల మాసీ పునరుజ్జీవం పూర్తయితే అద్భుతనరంగా ఆవిష్కృతామవుతుందని రేవంత్ రెడ్డి చెప్పుకోచ్చారు. మూసీ పునరుజ్జీవంతో పర్యాటక అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రానికి కేవలం హైదరాబాద్ నుంచే 65 శాతం ఆదాయం వస్తోంది, దానిని మరింత పెంచుతామని సీఎం పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినా.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేసిందన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని, రాష్ట్రంలో సంక్షేమపథకాలు అమలు చేస్తున్నాం.. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చేశామని సీఎం వెల్లడించారు. మూసీ కోసం భూములిచ్చేవారికి వంద శాతం సంతృప్తి చెందేలా ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారు. మూసీ ప్రాజెక్టును ఎన్జీవోలు వ్యతిరేకిస్తే అర్థం ఉంది, కానీ పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులేందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావట్లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ప్రపంచస్థాయి మేధావినని అనుకుంటున్నారు కాదా.. మూసీని బాగు చేసే అంశంలో కేటీఆర్ తన ఆలోచనలు చెప్పొచ్చని రేవంత్ రెడ్డి కోరారు. అంతర్జాతీయ అవగాహన ఉన్న కేటీఆర్ కు మూసీని ఎలా బాగు చేయాలో తెలియదా..? అని ప్రశ్నించారు. మూసీ పునరుజ్జీవంపై కేటీఆర్ నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నామని,హరీశ్ రావు, ఈటల రాజేందర్ తమ ప్రతిపాదనలు తెలపాలన్ని కోరారు.




