మనకు దీపావళి అంటే "చిచ్చు బుడ్లు".. వాళ్లకు మాత్రం "సారా బుడ్లు"
హైదరాబాద్,(విజయక్రాంతి): హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయిందనడం సరికాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దత వచ్చిందని, ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసి ఆయన పాస్ పోర్టు రద్దయిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభాకర్ రావు అమెరికాలో అక్రమంగా ఉంటునట్లే, రాజకీయంగా కేసీఆర్ పని అయిపోయిందని సీఎం ఎద్దేవా చేశారు. సినిమాల్లో రాజమౌళి, రాంగోపాల్ వర్మ... ఇద్దరిది వేర్వేరు స్టైల్ అని, రాజకీయాల్లో తన స్టైల్ తనది.. కేటీఆర్ స్టైల్ కేటీఆర్ ది అని స్పష్టం చేశారు. అనధికార విదేశీ మద్యంతో కేటీఆర్ దీపావళి జరుపుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. జన్వాడ ఫాంహౌస్ రేవ్ పార్టీపై బీఆర్ఎస్ నేతలు చెప్పిన కట్టుకథలు హాస్యాస్పదంగా ఉన్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మంచి పనులకు మీడియా సహకరించాలని కోరారు. జన్వాడ ఫాంహౌస్ లో మాత్రం సారాబుడ్లు బయటికొచ్చాయని ముఖ్యమంత్రి విమర్శించారు. అవసరమైతే వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు పాదయాత్ర చేస్తా అని, మూసీ పరివాహకంలో సమయం వచ్చినప్పుడు పాదయాత్ర చేస్తా అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అక్రమ సొమ్ముతో సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఎంతో ఆలోచించే హైడ్రాపై రంగంలోకి దిగాం అని, హైడ్రాపై దేశమంతా తెలిసేలా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసిందని సీఎం ఆగ్రహాం వ్యక్తం చేశారు. మూసీపై రాష్ట్రమంతా చర్చించుకునేలా కేటీఆర్ ప్రచారం చేస్తున్నారని, మాజీ సీఎం కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి రూ.7.50 లక్షల కోట్లు అప్పులు మిగిల్చి వెళ్లారన్నారు. రుణమాఫీలో సాంకేతిక లోపాలు ఉన్నవి మాత్రమే ఆగాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. తనది చిన్నవయస్సు... రాజకీయంగా ఇంకా భవిష్యత్ ఉందని, అణచివేతతో ప్రజాగ్రహాన్ని మూటగట్టుకోలేను అని రేవంత్ రెడ్డి చెప్పారు. అందరి విషయంలోనూ ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.




