పదో తరగతి టాపర్లకు పురస్కారాలు అందించిన సీఎం
విద్యార్థులతో సీఎం రేవంత్ రెడ్డి మాటామంతి
పిల్లలకు అమ్మఒడి తొలి పాఠశాల
ప్రభుత్వ పాఠశాలలో చదివిన నాకు వాటి విలువ బాగా తెలుసు
హైదరాబాద్: పిల్లలకు అమ్మఒడి తొలి పాఠశాల అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రవీంద్ర భారతిలో పదోతరగతి టాపర్లకు సీఎం ప్రతిభా పురస్కారాలు అందించారు. వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.... కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయన్నారు. పాఠశాలల మూసివేత కోడి ముందా.. గుడ్డు ముందా.. అన్నట్లుగా తయారైందని పేర్కొన్నారు.
ఒక్కో విద్యార్థి మీద ప్రభుత్వం రూ. 80 వేలు ఖర్చు పెడుతోందని సీఎం తెలిపారు. ప్రభుత్వం పెట్టే ఖర్చులో అధిక శాతం టీచర్ల వేతనాలకే పోతుందని చెప్పారు. డీఎస్సీ ద్వారా త్వరలోనే టీచర్ పోస్టుల భర్తీ చేస్తామన్నారు. పిల్లలను చేర్పించకపోతే పాఠశాల మూతబడుతుందని తల్లిదండ్రులకు చెప్పాలని ఆయన వివరించారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ద్వారా తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించామని చెప్పారు.
మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా మహిళా సంఘానికే అప్పగిస్తామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన నాకు వాటి విలువ బాగా తెలుసని సీఎం వ్యాఖ్యానించారు. చిన్న పిల్లలను రెసిడెన్సియల్ పాఠశాలల్లో వేసి అమ్మఒడికి దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఒకే సిలబస్ ఏళ్ల తరబడి అమలు చేసేవారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్చలేదన్నారు. ఇకపై విద్యా కమిషన్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సిలబస్ మారుస్తామని చెప్పారు. విలువైన సూచనలు ఎవరు చేసినా.. తప్పక పాటిస్తామని తెలిపారు.






