29 August, 2026 | 2:54 PM

దుర్గామాత, భూలక్ష్మి అమ్మవార్ల వార్షికోత్సవం

29-08-2026 02:22 PM

ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్

అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలి: నరసింహ గౌడ్

అమీన్‌పూర్, ఆగస్టు 29(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పరిధిలోని బీరంగూడ డివిజన్ పటేల్‌గూడలో కొలువైన శ్రీ దుర్గామాత, శ్రీ భూలక్ష్మి అమ్మవార్ల ఆలయాల ఐదవ వార్షికోత్సవ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి అమీన్‌పూర్ పురపాలక సంఘం మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నందారం నరసింహ గౌడ్ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

ఈ సందర్భంగా నందారం నరసింహ గౌడ్ మాట్లాడుతూ.. పటేల్‌గూడ దుర్గామాత, భూలక్ష్మి అమ్మవార్లు మహిమాన్వితమైన శక్తిస్వరూపిణులని, భక్తుల కొంగుబంగారమై కోరిన కోర్కెలు తీరుస్తున్నారని కొనియాడారు. ఆలయ నిర్మాణం జరిగి ఐదు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామ ప్రజలకు, భక్తులకు, ఆలయ కమిటీ సభ్యులకు ఆయన ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. అమ్మవారి దివ్య ఆశీస్సులతో అమీన్‌పూర్ పరిధిలోని ప్రజలే కాకుండా, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సకల ఐశ్వర్యాలతో సుభిక్షంగా వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

ఈ వేడుకల్లో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు అన్నదాన, తీర్థప్రసాద ఏర్పాట్లను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..