09-10-2025 01:12:18 PM
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) ఆధ్వర్యంలో జరిగిన జూమ్ మీటింగ్‌లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దిశానిర్దేశం చేశారు. జిల్లాల ఇంచార్జ్ మంత్రులు స్థానిక నాయకులతో అత్యవసరంగా చర్చించి అభ్యర్థులను ఎంపికను పూర్తిచేయాలని ఆదేశించారు. అభ్యర్థుల జాబితాను తుది రూపమివ్వడంతో పాటు బీ ఫారమ్‌లు వెంటనే జారీ చేయాలని సూచించారు. సంబంధిత అభ్యర్థులందరూ నో డ్యూ సర్టిఫికేట్‌లు సమర్పించాలన్నారు. లీగల్ సెల్‌ను యాక్టివ్ చేసి, గాంధీ భవన్లో(Gandhi Bhavan) లీగల్ టీమ్‌తో పాటు సమన్వయం కోసం ప్రత్యేక బృందం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. బీసీ రిజర్వేషన్ల కేసుపై హైకోర్టులో జరుగుతున్న విచారణను పీసీసీ అధ్యక్షుడు(PCC President) స్వయంగా పర్యవేక్షించాలని కోరారు.
కోర్టు తీర్పు(Telangana High Court Judgment) వెలువడిన వెంటనే తదుపరి కార్యాచరణపై రాత్రి మరో సమీక్షా సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. మొదటి విడత అభ్యర్థుల జాబితా రాత్రికే సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియపై అన్ని పరిస్థితులను ఎదుర్కొని ముందుకెళ్తున్నామని సీఎం తెలిపారు. రిజర్వేషన్ల దామాషా ప్రకారం అభ్యర్థులను ఖరారు చేయాలని ఆదేశించారు. ఇన్ ఛార్జ్ మంత్రులు.. ముఖ్యనేతలతో చర్చించి అభ్యర్థులను ఖరారు చేయాలని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియకు పూర్తిస్థాయిలో సమయం కేటాయించాలన్నారు. నామినేషన్ల దరఖాస్తు నమూనా పత్రం క్షేత్రస్థాయికి పంపాలన్నారు. గాంధీభవన్ లో న్యాయపరమైన అంశాల నివృత్తికి ఎన్నికల ప్రక్రియపై అవగాహన కలిగిన వారు సమన్వయ కమిటీ ఉండేలా చూడాలని సూచించారు. ఎంపీపీలు, జడ్పీ ఛైర్మన్ పదవుల ఎంపికపై పీసీసీ నిర్ణయిస్తుందని సీఎం తేల్చిచెప్పారు. పీసీసీ నిర్ణయించే వరకు రాజకీయ ప్రకటనలు చేయవద్దని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలను పర్యవేక్షించాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. నేటి నుంచి ఎల్లుండి వరకు తొలి విడత నామినేషన్లు స్వీకరించనున్నారు.