15 August, 2026 | 1:29 PM

గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు

15-08-2026 12:57 PM

హైదరాబాద్: భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను(CM Revanth Reddy hoists National Flag) ఆవిష్కరించారు. గోల్కొండ కోటపై తొలిసారి వందేమాతరం గీతాలాపన చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, మేము పటిష్టమైన శాంతిభద్రతలను నిర్ధారిస్తూ, తెలంగాణను పెట్టుబడులు, పరిశ్రమలు, అంతర్జాతీయ కార్యక్రమాలకు సురక్షితమైన గమ్యస్థానంగా నిలబెడుతున్నామని పేర్కొన్నారు. ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలుగా నెహ్రూ పేర్కొన్నారు. నెహ్రూ ప్రారంభించిన ఎన్నో ప్రారంభించిన ఎన్నో ప్రాజెక్టుల ఫలాలు అనుభవిస్తున్నామన్నారు. ఈ ప్రభుత్వ 32 నెలల కృషి ఇప్పుడిప్పుడే కనిపిస్తోందని పేర్కొన్నారు.

దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్రంలో 92 శాతం అధికంగా ఉందని పేర్కొన్నారు. వ్యవసాయాన్ని పండగ చేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రైతుభరోసా కింద రూ. 36 వేల కోట్లు రైతులకు అందించామని గుర్తుచేశారు. మొత్తంగా రైతు సంక్షేమం కోసం రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం సరికొత్త రికార్డులు అధిగమించిందని పేర్కొన్నారు. రాష్ట్ర నీటి హక్కుల విషయంలో రాజీ పడేది లేదని తేల్చిచెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతుల కళ్లల్లో ఆనందం చూస్తామని తెలిపారు.

త్వరలోనే పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి నీరు అందించనున్నామని చెప్పారు. వ్యవసాయంతో పాటు నివాసాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. కల్యాణ లక్ష్మి కింద ఆడబిడ్డలకు రూ. 4,790 కోట్లు అందజేశామని పేర్కొన్నారు. తెలంగాణ ఆడబిడ్డలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని వ్యాఖ్యనించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే ఉక్కు సంకల్పంతో ఉన్నామన్నారు. మహిళలను ఆర్టీసీ అద్దె బస్సులకు యజమానులుగా చేశామన్నారు. 15 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని సూచించారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీని ఇవాళే ప్రారంభించుకుంటున్నామన్న సీఎం పేదల ఆత్మగౌరవం నిలబెట్టేలా ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.

రెండో విడతలో 5.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఈ ఏడాది పట్టణ ప్రాంత పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని, క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్లు నిర్మించి అందించనున్నామన్నారు. కొత్తగా 2.50 లక్షల మందికి పింఛన్ల మంజూరు చేస్తున్నామని, దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో కులగణన పూర్తయ్యిందని వివరించారు. తెలంగాణను ఆదర్శంగా తీసుకుని కేంద్రం కూడా కులగణన చేపట్టిందన్నారు. తెలంగాణ ఒత్తిడి వల్లే కేంద్రం జనగణనలో కులగణన చేర్చిందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.