బాహుబలి శైలిలో సీఎం రేవంత్‌రెడ్డి
వెయ్యి రోజుల ప్రజాపాలన నినాదంతో గణపతి మండపం
మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో వినూత్న ప్రతిమ
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): వినాయక చవితి సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక గణపతి మండపం భక్తులు, ప్రజలను ఆకట్టుకుంటోంది. సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించేలా ‘తెలంగాణ రైజింగ్ డేస్ యాజ్ సీఎం’ నినాదంతో మండపాన్ని తీర్చిదిద్దారు. తెలంగాణ ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మండపంలో గణపతి ప్రతిమను వినూత్నంగా రూపొందించారు.
‘బాహుబలి’ చిత్రంలోని శివలింగాన్ని భుజాన మోసే సన్నివేశాన్ని పోలిన రీతిలో.. సీఎం రేవంత్‌రెడ్డి విగ్రహం భుజంపై గణనాథుడిని ఎత్తుకున్నట్లుగా ప్రతిమను తయారు చేశారు. తెల్ల చొక్కా, నల్ల ప్యాంటు, ఆకుపచ్చ కండువాతో రూపొందించిన రేవంత్ ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గణపతి ప్రతిమతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసేలా మండపం చుట్టూ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ వంటి కార్యక్రమాలను ఫ్లెక్సీల ద్వారా వివరించారు. రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ నది పునరుజ్జీవన ప్రణాళిక వంటి మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రదర్శనలో చేర్చారు.