గవర్నర్‌ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి, మంత్రి శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డితో కలిసి లోక్‌భవన్‌లో గవర్నర్ ని కలిశారు. విద్యా రంగానికి సంబంధించి వివిధ అంశాలతో పాటు, వచ్చే జూన్ 12న ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ ఆధ్వర్యంలో చేపట్టనున్న అవగాహన కార్యక్రమంపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చర్చించారు.
ప్రధానంగా విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కల్పించాలని గవర్నర్ సూచించారు. అందుకోసం విద్యార్థులతో ప్రమాణం చేయించేలా కార్యక్రమాలు చేపట్టాలని, పాఠశాలలు, కళాశాలల్లో అడ్మిషన్ల సమయంలోనే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రమాణపత్రం తీసుకోవాలని గవర్నర్ చెప్పారు. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూచనలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.






