2 September, 2026 | 3:38 PM

మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

02-09-2026 | 02:26pm

న్యూఢిల్లీ:  కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026(Invest Telangana Global Summit-2026)కు హాజ‌రు కావాల‌ని కేంద్ర రక్షణ శాఖ మంత్రిని ఆహ్వానించారు.  భారత్ ఫ్యూచర్ సిటీ (Bharat Future City)లో డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. స‌దస్సులో భాగంగా నిర్వహించే డిఫెన్స్ ఎక్స్‌పో 2026 (Defence Expo 2026)ను ప్రారంభించాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. 

మహబూబ్ నగర్ జిల్లా(Mahabubnagar District)లోని దేవరకద్ర మండలంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాల ఆధ్వర్యంలో చేపట్టనున్న డీఆర్డీఎల్ ప్రాజెక్టుకు 416.18 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించాలని, ఎకరానికి కాకుండా మొత్తం భూమికి సంవత్సరానికి కేవలం రూ. 1 నామమాత్రపు లీజు అద్దెతో 33 సంవత్సరాల కాలానికి భూమిని కేటాయించనున్నట్లు తెలిపారు. అవ‌స‌ర‌మైతే దానిని మ‌రో రెండుసార్లు లీజు పొడిగించుకునే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు.

ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించి రాజ్ నాథ్ తో చర్చించారు. విమానాశ్రయానికి సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే 750 ఎక‌రాలు భూ సేక‌ర‌ణ చేపట్టింద‌ని రాజ్‌నాథ్ సింగ్‌ కి వివరించి, ర‌క్ష‌ణ శాఖ కోరిన‌ట్లు మొత్తం 1500 ఎక‌రాలు కోరినందున‌, మ‌రో 750 ఎక‌రాలు సేక‌రించి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ముఖ్య‌మంత్రి అంగీకారించారు.