జూటా పాలనకు కేరాఫ్ రేవంత్ సర్కారు
22ఏ భూముల సమస్యపై అసెంబ్లీని కదిలిస్తాం
అరచేతుల స్వర్గం చూపించి అందల మెక్కారు
హామీలు అమలు చేయమంటే మొహం చాటేస్తున్నారు
420 హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ దారుణ వైఫల్యం
100 రోజులన్నారు..1000 రోజులు అయ్యింది
ఏడు రోజుల పోరు బాటను విజయవంతం చేయండి
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్ 420 హామీల అమలుకు బీఆర్ఎస్ పోరుబాట
తొలి రోజు ఇంటింటికి బాకీ కార్డుల పంపిణీ, 420 హామీల ఫ్లెక్సీ ప్రదర్శన
పటాన్ చెరు, సెప్టెంబర్ 2(విజయ క్రాంతి): 420 హామీల పేరుతో అరచేతిలో స్వర్గం చూపించి అందలమెక్కిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్న హామీల అమలులో ఘోరంగా విఫలం కావడంతోపాటు విధ్వంస పాలన కొనసాగిస్తుందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల దగా పాలన నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ చేపట్టిన వారం రోజుల పోరుబాట కార్యక్రమంలో భాగంగా తొలి రోజు పటాన్ చెరు పట్టణంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేతృతంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎంజీ రోడ్డు నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ఫ్లెక్సీ ప్రదర్శన, నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రజలకు బాకీ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో పాలన సాగిస్తోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. తొంభైవ దశకం నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఇంత దారుణమైన, దరిద్రమైన పరిపాలనను తాను చూడలేదని విమర్శించారు.
ప్రజలకు ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలి
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన 420 హామీలను ప్రజలకు ఇచ్చిన మాటగా భావించి వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరిస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా పటాన్చెరు నియోజకవర్గంలో కూడా ప్రతి ప్రజా సమస్యపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
22ఏ భూములపై పోరాటం ఉధృతం
22ఏ నిషేధిత జాబితాలో ఇలాంటి వివాదాలు లేని భూములను చేర్చడం ద్వారా ప్రజల ఆస్తులను అమ్ముకోలేని, కొనలేని పరిస్థితి ఏర్పడుతోందని ఎమ్మెల్యే అన్నారు. 22ఏ పేరుతో ప్రజల ఆస్తులపై విధిస్తున్న ఆంక్షలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపారు. 22ఏ భూముల సమస్యను అసెంబ్లీలో ప్రధాన అంశంగా లేవనెత్తి, బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు.
సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేశారు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ తదితర సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఎమ్మెల్యే జిఎంఆర్ ఆరోపించారు. పేదలు, మహిళలు, విద్యార్థులు, రైతులు, సామాన్య ప్రజలకు గతంలో అందిన సంక్షేమ పథకాలు ఇప్పుడు సక్రమంగా అందడం లేదని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.
ప్రతి గ్రామం, ప్రతి వార్డులో పోరాటం
పటాన్ చెరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి డివిజన్‌లో బీఆర్ఎస్ పోరు బాట కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరును వివరించాలని సూచించారు.
పార్టీ తరఫున పెద్ద సంఖ్యలో బకాయి హామీల కార్డులను సిద్ధం చేశామని, వాటిని నియోజకవర్గంలోని అన్ని డివిజన్లు, వార్డులు, గ్రామాలకు తీసుకెళ్లి ప్రజలకు పంపిణీ చేయాలని నాయకులకు సూచించారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పోరాటం ఆగదని.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కో-ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.






