31 July, 2026 | 1:25 AM

సీఎం రేవంత్‌రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం

31-07-2026 12:35 AM
  1. 20 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం   
  2. శంషాబాద్ వద్ద ల్యాండింగ్ సమస్య తలెత్తడంతో ఘటన

రంగారెడ్డి, జూలై 30(విజయక్రాంతి): ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం విమానానికి ల్యాండింగ్ సమస్య తలెత్తడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 20 నిమిషాల పాటు సీఎం రేవంత్‌రెడ్డి ఫ్లుటై గాల్లోనే చక్కర్లు కొట్టడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం రాత్రి ఢిల్లీ నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న ఇండిగో విమానంలో (6ఈ 2715) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య ప్రతినిధులు, సాధారణ ప్రయాణికులున్నారు.

విమానం శంషాబాద్ విమానాశ్రయం పైకి చేరుకుని, ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ ) నుంచి తుది క్లియరెన్స్ లభించలేదు. అదే సమయంలో రన్ వే వద్ద సిగ్నలింగ్ లోపం లేదా వేరే విమానం ఉందనే అనుమానంతో పైలట్ అప్రమత్తమయ్యారు. ల్యాండింగ్ ప్రక్రియను మధ్యలోనే నిలిపివేసిన పైలట్, అప్పటికప్పుడు విమానాన్ని తిరిగి పైకి టే కాఫ్ చేశారు. ఆకాశంలో సుమారు 20 నిమిషాల పాటు విమానం చక్కర్లు కొట్టడంతో లోపల  ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

చివరకు ఏటీసీ నుంచి స్పష్టమైన క్లియరెన్స్ రావడం, రన్ వే సురక్షితమని నిర్ధారించుకున్న తర్వాత   పైలట్ విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సహా విమానంలో ఉన్న మొత్తం 229 మంది ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.