calender_icon.png 14 November, 2025 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

పదవులు ఎవరికీ శాశ్వతం కావు: సీఎం రేవంత్

14-11-2025 07:09:55 PM

హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. నవీన్ యాదవ్ 24,729 ఓట్లతో విజయం సాధించడంతో ఆర్వో గెలుపు ధ్రువీకరణ పత్రం ఆయన అందజేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 98,988 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 17,061 ఓట్లు వచ్చాయి. ప్రతి రౌండ్ లోనూ కాంగ్రెస్ అభ్యర్థికి ఆధిక్యం కనబర్చడంతో ఏ రౌండ్ లోనూ బీఆర్ఎస్ కు ఆధిక్యం దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. రెండు ఉపఎన్నికల్లోనూ గెలుపొందింది. 2024 జూన్ లో జరిగిన కంటోన్మెంట్ ఉపఎన్నికలోనూ విజయం సాధించగా, ఏడాది జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆత్యధిక మెజారిటీ సాధించి చరిత్ర సృష్టించిందిం. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... కేంద్రం నుంచి నిధులు రాకుండా కిషన్ రెడ్డి సహాయ నిరాకరణ చేస్తున్నారని, అనేక ప్రాజెక్టులకు అనుమతులు రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. మెట్రో, మూసీ ప్రక్షాళన వంటి వాటికి అనుమతులను అడ్డుకుంటున్నారని సీఎం చెప్పారు. కిషన్ రెడ్డి ఎంపీ నియోజకవర్గంలోనే బీజేపీకి బాగా ఓట్లు తగ్గాయని,  బీజేపీ ఓట్లు 65 వేల నుంచి 17 వేలకు ఎందుకు తగ్గాయో ఆయనే ఆలోచించుకోవాలని సూచించారు. మంత్రి కిషన్ రెడ్డి వ్యవహార శైలిని ప్రజలు గమనించారని, భూకంపానికి ముందు వచ్చే ప్రకంపనగా జూబ్లీహిల్స్ ఫలితాన్ని చూడాలని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తీరు మారకుంటే భూకంపం వంటి ఫలితాలే బీజేపీకి వస్తాయని, రాజకీయాలు మాని.. రాష్ట్రాభివృద్ధికి కేంద్రమంత్రులు కలిసి రావాలని పేర్కొన్నారు.

 రాష్ట్ర ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చే బాధ్యత కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలపై ఉందని, కేటీఆర్ తన అహంకారాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని సీఎం ఆగ్రహించారు. పదవులు ఎవరికీ శాశ్వతం కావు, మనం ఇంకా చాలా ఏళ్లు రాజకీయాలు చేయాల్సి ఉందని  సీఎం రేవంత్ అన్నారు. ఆడబిడ్డలు తండ్రి ఆస్తిలో వాటా అడగటం సహజమని తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 39 శాతం ఓట్లు వచ్చాయని, 6 నెలల తర్వాత వచ్చిన లోక్ సభ ఎన్నికల్లో ఓట్ల శాతం 42కు పెరిగిందన్నారు. ఈ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 51 శాతం ఓట్లను ప్రజలు ఇచ్చి సంక్షేమ పథకాలను అందిస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. అసూయ తగ్గించుకోవాలని ప్రతిపక్ష నేతలకు సీఎం సూచించారు. అధికారం పోయినా.. కేటీఆర్ లో అహంకారం, అసూయ పోలేదని, ఫేక్ న్యూస్ రాయించి.. ఫేక్ సర్వేలు చేయించుకుని భ్రమలో బతకొద్దని ఆయన హితబోధ చేశారు. బీఆర్ఎస్ ఓడిపోతుంది.. బీజేపీకి డిపాజిట్ కూడ రాదని ముందే తాను చెప్పనని, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన ఎంఐఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి పొత్తులు, మద్దతు ఉండటం సహజమని, బీహర్ అసెంబ్లీ ఫలితాలను ఇంకా తను సమీక్షించలేదని సీఎం చెప్పారు.