14-11-2025 07:16:20 PM
జిల్లా అదనపు కలెక్టర్ , ఇన్చార్జి జిల్లా విద్యాధికారి దీపక్ తివారి
కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయ క్రాంతి): భవిత కేంద్రాలలో వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), ఇన్చార్జి జిల్లా విద్యాధికారి దీపక్ తివారి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో భవిత కేంద్రాలలో వరుసతుల కల్పన పై ఇంజనీరింగ్ అధికారులు, విద్యాశాఖ అధికారులతో మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మానసిక దివ్యాంగ విద్యార్థుల కొరకు ఏర్పాటు చేసిన భవిత కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
భవనాల మరమ్మత్తులు, ర్యాంపుల నిర్మాణం, గ్రిల్స్ ఏర్పాటు, త్రాగునీరు, మూత్రశాలల నిర్మాణం, ఫ్యాన్లు, భవనాలకు పెయింటింగ్, రంగుల బొమ్మలు పనులను త్వరగా పూర్తిచేసే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు. మానసిక దివ్యాంగ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పెయింటింగ్స్ వేయాలని, ఈ ప్రక్రియను అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు మధుకర్, అబిద్ అలీ, ఇంజనీరింగ్ అధికారులు, సమన్వయకర్తలు పాల్గొన్నారు.