26-11-2025 11:46:14 AM
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా (SAESI) కొత్త సౌకర్యాన్ని ఏర్పాటు చేయడాన్ని స్వాగతించారు. ఇది ఏరోస్పేస్, రక్షణ రంగాలలో రాష్ట్ర వృద్ధిలో ముఖ్యమైన మైలురాయి అని అభివర్ణించారు. జీఎంఆర్ ఏరో పార్క్‌లో ఎల్ఈఏపీ ఇంజిన్ ఎంఆర్ఓ ప్రారంభోత్సవం, ఎం88 ఎంఆర్ఓ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి రామ్మెహన్ నాయుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... హైదరాబాద్ ను ఎంచుకున్న సాఫ్రాన్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. సాఫ్రాన్ సంస్థ ఏర్పాటు.. హైదరాబాద్ అభివృద్ధికి దోహదం చేస్తుందని, ఎరోస్సేస్, ఏవియేషన్ హబ్ గా హైదరాబాద్ ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు. మన రాజధానిలో ఏవియేషన్ కు చెందిన ఎన్నో సంస్థలు ఇప్పటికే ఉన్నాయని, ఏవియేషన్, ఎరోస్సేస్ నిపుణుల సంఖ్య పెరిగిందని సీఎం తెలిపారు. హైదరాబాద్, బెంగళూరును డిఫెన్స్, ఏవియేషన్ కారిడార్ గా ప్రకటించాలని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
వచ్చేనెల జరిగే గ్లోబల్ సమ్మిట్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానిస్తున్నామని, ఆ సమ్మిట్ లో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేయాలని ముఖ్యమంత్రి కోరుతున్నామన్నారు. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయబోతున్నామని, ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకోవాలన్నదే రాష్ట్ర లక్ష్యమని సీఎం పేర్కొన్నారు.