26-11-2025 12:50:31 AM
అంతా రామమయం.. జగమంతా రామమయం!
అయోధ్యలో ధ్వజారోహణం
* ఉత్తరప్రదేశ్‌లోని రామ జన్మభూమి పుణ్యక్షేత్రం అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముడు కొలువైన ఆలయ నిర్మాణం పరిపూర్ణమయ్యేందుకు.. ధ్వజారోహణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం శుభ అభిజిత్ ముహూర్తాన ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గర్భగుడిపై కాషాయ ధర్మ ధ్వజ సూర్యవంశీ పతాకాన్ని ఆవిష్కరించారు.
వేద మంత్రోచ్ఛారణ ప్రతిధ్వనిస్తుండగా.. భక్తుల జయ జయ ధ్వానాలు మార్మోగుతుండగా వేడుక జరిగింది. పతాకావిష్క రణను వీక్షించి భక్తజనం పరవశించింది. ధ్వజారోహణతో ఆలయ నిర్మాణ పూర్ణాహుతి జరిగిందని వేద పండితులు, ఆల య అధికారులు ప్రకటించారు.
* ఈరోజు భారతదేశం ఎంతో గర్వపడే రోజు. వందల ఏళ్ల గాయాలు ఇప్పటికి మానాయి.
ప్రధాని నరేంద్ర మోదీ
* రామజన్మభూమి కోసం ప్రాణాలను త్యాగం చేసినవారు ధన్యులు. వారి ఆత్మలు ఈరోజు సంతృప్తి చెందుతాయి.
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్
ధ్వజ పతాకంపై ఒక్కో చిహ్నానికి ఒక్కో విశేషం
లక్నో, నవంబర్ 25: ‘అయోధ్యలోని రామ జన్మభూమి (రామ్‌లల్లా) ఆలయంలో నిర్వహించిన ధ్వజారోహణంతో 500 ఏళ్ల నాటి సంకల్పం నెరవేరింది. పూర్ణాహుతి క్రతువు పూర్తయింది. తద్వారా భారతీయ సాంస్కృతిక చైతన్యానికి అయోధ్య సాక్షిగా నిలిచింది. శ్రీరాముడి భక్తుల సంకల్పం ఇప్పటికి సిద్ధించింది. కోట్లాది మంది కల సాకారమైంది. శతాబ్దాల నాటి గాయాలు, బాధల నుంచి నేడు ఉపశమనం లభించింది.
శతాబ్దాలపాటు అపరిష్కృతంగా ఉన్న సమస్యకు పరిష్కారం లభించింది. ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతిఒక్కరికీ నమస్కరిస్తున్నా. ధర్మ ధ్వజ సూర్యవంశీ పతాకం కేవలం జెండా మాత్రమే కాదు. భారతీయ సంస్కృతి పునర్వికాసానికి చిహ్నం. శ్రీరాముడి సిద్ధాంతాలను జెండా ప్రపంచానికి చాటుతుంది. భక్తుల్లో ఆధ్యాత్మిక స్ఫూర్తిని, ప్రేరణను రేకెత్తిస్తుంది. ఈరోజు భారతదేశం ఎంతో గర్వపడే రోజు. వందల ఏళ్ల గాయాలు ఇప్పటికి మానాయి’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో కలిసి ఆయన ఆలయ గర్భగుడిపై ధర్మ ధ్వజ సూర్యవంశీ పతాకాన్ని ఆవిష్కరించారు. వేడుకకు ఆ రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ధర్మ ధ్వజ పతాకాన్ని దూరం నుంచి చూసినా, రాముడిని చూసినంత పుణ్యం వస్తుందని పేర్కొన్నారు. ఒక సాధారణ వ్యక్తి పురుషోత్తముడిగా ఎలా ఎదిగాడో తెలియాలంటే అయోధ్య ఆలయాన్ని సందర్శించాలని పేర్కొన్నారు.
‘శ్రీరాముడు కులం చూడడు.. కేవలం భక్తి మాత్రమే చూస్తాడు’ అని కొనియాడారు. రాముడు అయోధ్య నుంచి వనవాసానికి వెళ్లేటప్పుడు యువరాజు అని, కానీ.. తిరిగి వచ్చేనాటికి ఆయన పురుషోత్తముడై వచ్చాడని పేర్కొన్నారు. ‘మన చుట్టూ కొందరు ఇంకా బానిస భావజాలంతో ఉన్నారు. రాముడు ఓ కాల్పనిక వ్యక్తి అని వారంటున్నారు. అలాంటి బానిస భావజాలం ఉన్న వ్యక్తులకు చోటు ఇవ్వొద్దు. భారత్‌లో ప్రతి ఇంట్లో, ప్రతి మనసులో రాముడు ఉన్నాడు. ప్రజాస్వామ్యానికి భారత్ పుట్టినిల్లు.
ఇది మన డీఎన్‌ఏలోనే ఉంది. శతాబ్దాల క్రితమే భారత్‌లో ప్రజాస్వామ్య విధానం ఉంది. తమిళనాడులోని ఉత్తర మేరూర్‌లో దొరికిన శాసనం ప్రజాస్వామ్యం గురించి వెల్లడించింది’ గుర్తుచేశారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ.. ‘ధ్వజారోహణం అందరి ఆశలు నెరవేరిన రోజు. రామజన్మభూమి లక్ష్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వారి ఆత్మలు ఈరోజు సంతృప్తి చెందుతాయి’ అని అన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ‘ఈ పవిత్ర దినం.. రామజన్మభూమి ఉద్యమంలో ప్రాణాలను త్యాగం చేసిన యోధులకు అంకితం’ అని పేర్కొన్నారు.
రోడ్ షోకు విశేష స్పందన
ముందుగా ప్రధాని మోదీ అయోధ్య విమానాశ్రయానికి చేరుకోగా ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు రోడ్‌షోగా నగరంలోని రామ్‌లల్లా ఆలయానికి పయనమయ్యారు. ‘జై శ్రీరామ్’ నినాదాలతో దారి పొడవునా ప్రజలు మోదీకి బ్రహ్మరథం పట్టారు. వారిపై పూల వర్షం కురిపించారు. మార్గమధ్యంలో వందలాది మంది కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలిచ్చారు.
ఆలయంచేరుకున్న తర్వాత ప్రధాని, ముఖ్యమంత్రి ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయ పరిధిలోని సప్త మందిరాలు, శేషావతార్ మందిరం, మాతా అన్నపూర్ణ మందిరాలను దర్శించారు. మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగస్త్య, మహర్షి వాల్మీకి, దేవి అహల్య, నిషాదరాజ్ గుహ, మాతా శబరి మందిరాలను సందర్శించారు.
మూడు ప్రతీకలు.. ఎన్నో విశేషాలు
రామ జన్మభూమి ఆలయ గర్భగుడిపై ప్రధాని మోదీ ఎగురవేసిన కాషాయ ధ్వజ పతాకానికి సంబంధించి ఎన్నో విశేషాలున్నాయి. జెండా లంబకోణ త్రిభుజాకారంలో ఉంటుంది. దీనిపై సూర్యుడు, కోవిదార చెట్టు చిత్రాలు ముద్రించి ఉన్నాయి. జెండా అంచున ‘ఓం’ చిహ్నాలు ఎంబ్రాయిడరీ చేసి ఉన్నాయి. గర్భగుడికి 42 అడుగుల ఎత్తులో ధ్వజ పతాకం రెపరెపలాడుతుంది. జెండా కాషాయ వర్ణంలో ఉండి 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పులో లంబకోణ త్రిభుజాకృతిలో ఉంటుంది.
గుజరాత్ అహ్మదాబాద్ నగరంలోని ఓ పారాచ్యూట్ తయారీ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా సిద్ధం చేసింది. జెండా సుదీర్ఘకాలం మన్నేలా సంస్థ జాగ్రత్తలు తీసుకుంది. సిబ్బంది 25 రోజులు శ్రమించి పారాచ్యూట్ తయారీకి వినియోగించే గ్రేడ్-1 వస్త్రంతోపాటు పట్టుదారాలతో వినియోగించి జెండా తయారు చేశారు. జెండాపై రాముడి తేజస్సు, శౌర్యాన్ని సూచించేలా సూర్యుడి చిత్రం ఉంటుంది. రాముడి పరాక్రమానికి, రాజ్యాధికారానికి సూర్యుడు ప్రతీక.
అలాగే కోవిదార (కాంచనార) చెట్టు చిత్రీంచి ఉంటుంది. జెండా అంచున బంగారు దారాలతో అల్లిన ‘ఓం’ చిహ్నాల ఎంబ్రాయిడరీ ముస్తాబై ఉంటుంది. పూర్వం మహర్షి కశ్యపుడు మందార, పారిజాత మొక్కలను కలగలిపి కోవిదారను చెట్టును సృష్టించాడని పురాణాలు చెప్తున్నాయి.
రామాయణంలో చెట్టుకు సంబంధించిన ప్రస్తావన ఉంది. రావణుడు లంకా నగరంలో సీతమ్మను ఉంచిన అశోక వనంలో ఈ వృక్షం కూడా ఉందని రామాయణంలో రాసి ఉంది. అందుకే ఈ వృక్షం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, పవిత్రత పొందింది. పురాతన కాలం నుంచీ ఆయుర్వేద వెద్యులు ఈ చెట్టు బెరడు, వేళ్లతో ఔషధాలు తయారీ చేసేవారు.
7 వేల మంది అతిథుల వీక్షణ
ధ్వజారోహణం జరిగిన రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఇదేరోజున శ్రీసీతారాముల కల్యాణం జరిగింది. అభిజిత్ లగ్నంలో శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. విశిష్టమైన రోజున అదే అభిజిత్ లగ్న ముహూర్తంలో ధ్వజారోహణ వేడుక సైతం జరిగింది. రామమందిర నిర్మాణం వందశాతం పూర్తయ్యిందనే విశేషానికి సంకేతంగా ఆలయ అధికారులు, వేద పండితులు ఈ వేడుక నిర్వహించారు. ఈ ఘట్టంతో రామాలయం నిర్మాణం సంపూర్ణంగా పూర్తయినట్లు వేద పండితులు ప్రకటించారు.
అపూర్వ ఘట్టాన్ని ప్రత్యక్షంగా 7 వేల మందికిపైగా అతిథులు తిలకించారు. వేడుకల కోసం ఆలయ ప్రాంగణంతోపాటు నగరాన్ని ముస్తాబు చేసేందుకు ఆలయ అధికారులు సుమారు 10 టన్నుల పూలను వినియోగించారు. వేడుకల్లో సిబ్బంది వందలాది బెలూన్లను గాలిలోకి వదిలారు. వాటికి కట్టిన దారాన్ని బంగారంతో తయారు చేయడం విశేషం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.