06-12-2025 04:34:12 PM
హైదరాబాద్: ప్రజాపాలన రెండేళ్ల విజయోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నల్గొండ జిల్లా దేవరకొండలో పర్యటించారు. దేవకొండలో రూ.23 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం తెలగాణ వైభవం రేవంతన్నపాట పోస్టర్ ను సీఎం ప్రారంభించారు. ప్రజాపాలన విజయోత్సవ సభలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైన సందర్భంగా ఉత్సవాలు చేసుకుంటున్నామని, ప్రజా ప్రభుత్వానికి అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
రెండేళ్ల క్రితం ఓటును ఆయుధంగా మార్చి గడీల పాలనను కూల్చారని, నల్గొండ జిల్లా పోరాటాల పౌరుషం ఉన్న గడ్డ అని, నిజాం నిరంకుశ పాలనను ఎదురించిన జిల్లా నల్గొండ అన్నారు. గత ప్రభుత్వం పదేళ్లపాటు పేదలకు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, ఉన్న రేషన్ కార్డుల్లో పేర్లు చేర్చుకునేందుకు కూడా పదేళ్లపాటు అవకాశం ఇవ్వలేదని సీఎం విరుచుకుపడ్డారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు ఇచ్చిందని, రేషన్ కార్డులపై దొడ్డుబియ్యం రద్దు చేసి సన్నబియ్యం ఇస్తున్నామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రంలో 3.10 కోట్ల మందికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, గుజరాత్ సహా దేశంలో మారే రాష్ట్రంలోనూ సన్నబియ్యం ఇవ్వట్లేదని సీఎం హర్షం వ్యక్తం చేశారు.
ఇంకా ఏ రాష్ట్రంలో సన్నబియ్యం ఇస్తున్నారో బీజేపీ నేతలు చెప్పాలని, యూపీఏ ప్రభుత్వంలో రాష్ట్రంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గత పదేళ్లలో ఎంతమంది పేదలకు ఇళ్లు ఇచ్చారో కేసీఆర్ చెప్పాలని, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఊరిలో ఓట్లు అడుగామని ఈ సందర్భంగా సీఎం ప్రతిపక్ష నేతలకు సవాలు విసిరారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం జరిగిన గ్రామంలో మీరు ఓట్లు అడగాలని కేసీఆర్ కు ఆయన సూచించారు. మళ్లీ కాంగ్రెస్ పభుత్వం రాగానే 4.50 లక్షల ఇళ్లు పేదలకు మంజూరు చేశామని, ఇందిరమ్మ ప్రభుత్వం లాంబాడీలకు ఏస్టీ రిజర్వేషన్లు కల్పించిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.