ఉమ్మడి జిల్లాను వీడని వర్షం..
ఓసీల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి...
కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత.. ఎల్లంపల్లికి చేరుతున్న వరద...
ఏజెన్సీలోని పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు...
చెరువులకు జలకల
ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు..
మంచిర్యాల / ఆదిలాబాద్ / నిర్మల్ / కుమ్రంభీం ఆసిఫాబాద్, జూలై 30 (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఈ ఏడాది వానా కాలం సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు లేక వెలవెలబోయిన కుంటలు, చెరువుల్లోకి వరద ప్రవాహం చేరుతుండటం, బావుల్లో సైతం నీరు నిండుతుండటంతో పంటలకు ఊపిరి పోసినట్లు అయ్యింది. ప్రాజెక్టులన్నీ ఒక్కొటొక్కటిగా నిండుకుంటున్నాయి.
మరో వైపు గెరివియ్యకుండా వర్షం కురుస్తుండటంతో ఆయా జిల్లాలో వర్షాల తీవ్రతను ఎప్పటికప్పుడు ఆయా జిల్లాల కలెక్టర్లు కుమార్ దీపక్ (మంచిర్యాల), రాజర్షిషా (ఆదిలాబాద్), హరిత (కుమ్రంభీం ఆసిఫాబాద్), భవేష్ మిశ్రా (నిర్మల్)లతో పాటు రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్, నిర్మల్ ఎస్పీ జానకి షర్మీలా, కుమ్రంభీం ఆసిఫాబాద్ ఎస్పీ నితిఖా ఫంథ్, ఐటీడీఏ పీఓ మంద మకరందులు జిల్లా అధికారులతో కలిసి పర్యవేక్షిస్తున్నారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు అన్ని జిల్లా కేంద్రాల్లో కమాండ్ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్లతో ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ప్రమాదకరంగా మారిన వాగుల వద్ద హెచ్చరిక బోర్డులు, ఎరుపు రంగు రిబ్బన్లను ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహిస్తున్నారు. వాగులను, ప్రాజెక్టులను జిల్లా అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంత్రులు, ఎంఎల్‌ఏలు, ప్రజాప్రతినిధులు తిరుగుతూ ముంపు ప్రాంతాలను పరిశీలిస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
గురువారం ఆదిలాబాద్ జిల్లాలో 64.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా మంచిర్యాలలో 102.8 మిల్లీ మీటర్లు, కుమ్రంభీం ఆసిఫాబాద్ లో 121.4 మిల్లీ మీటర్లు, నిర్మల్ జిల్లాలో 54.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. మంచిర్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుతో పాటు ర్యాలీవాగు, గొల్లవాగు, నీల్వాయి వాగు ప్రాజెక్టుల్లో వరద నీరు చేరుతుంది.
ర్యాలీవాగు మత్తడి పారుతుంది. చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. జిల్లాను ఆనుకొని ప్రాణహిత నది సైతం జోరుగా పారుతుంది. చెన్నూర్ లోని శనగకుంట చెరువు నిండుకొని మత్తడి పారడంతో చేపలు కొట్టుకుపోతుండటతో పట్టుకునేందుకు జనం ఎగబడ్డారు. మందమర్రి మండలం దొరలబంగ్లా ఏరియాలో పెద్ద కొండ చిలువ జనావాసాల్లోకి రాగా స్నేక్ క్యాచర్ మహేందర్ పట్టుకొని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. భారీ వర్షాల ప్రభావంతో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.
ఓసీల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని మూడు ఏరియాల పరిధిలో ఐదు ఉపరితల గనులు ఉండగా వర్షాల ప్రభావంతో ఒక్కో రోజు సుమారు 29 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో 15,220 టన్నుల ఉత్పత్తికి నష్టం జరగగా మందమర్రి ఏరియాలో 6,407 టన్నులు, బెల్లంపల్లి ఏరియాలో 7,400 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
పని ప్రదేశాల్లో నిలిచిన వర్షపు నీటిని అధిక సామర్థ్యం గల్ మోటార్లను ఏర్పాటు చేసి బయటకు పంపేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని ఇంద్రవెల్లి, ఉట్నూర్, గాదిగూడ, నార్నూర్, సిరికొండ మండలాల పరిధిలోని కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాంపూర్, సిరికొండకు వచ్చే రోడ్డు డ్యాంపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో మూడు రోజులపాటు రాకపోకలను నిషేధిస్తూ బోర్డ్ ఏర్పాటు చేశారు.
జిల్లాలోని మత్తడి గూడ, గంగాపూర్, సత్వజిగూడ, చిదరి ఖానాపూర్, అల్లికోరి, మార్కా గూడా, జైత్రంతాండా, జెండాగూడ, మామిడి గూడ (జి), నర్సాపూర్ (జె) వాగులు ఉప్పొంగడంతో జీపీ సిబ్బందిని అలర్ట్ చేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లాలో వర్షాలకు ప్రాజెక్టుల్లోకి, చెరువుల్లోకి వరద నీరు వచ్చిచేరుతుంది. జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుకు 1.20 లక్షల క్యూసెక్కుల నీరు వరద రూపంలో రావడంతో 16 గేట్ల ద్వారా 1.69 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. స్వర్ణ, శ్రీరామ్ సాగర్, భైంసా గడ్డం సుద్దవాగు, సదర్ మట్ ప్రాజెక్టులలోకి వరద నీరు వచ్చే చేరుతుంది. కడెం, ఖానాపూర్, ఎం బి దస్తురాబాద్, సారంగాపూర్ తదితర మండలాల్లోని వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
లోతట్టు ప్రాంతాలు జలమయి కావడంతో రైతులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఏజెన్సీ ప్రాంతంలో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
లింగాపూర్ లోని పిట్టగూడ వంతెనపై వరద నీరు ప్రవహించడంతో చ్‌పవహించడంతో తాండా, పులసింగ్ నాయక్ తాండా, జాములదార, గున్నూర్, ఆసిఫాబాద్ మండలం తుంపెల్లి, కొసారా, వట్టివాగు , చిర్రకుంట, ఉల్లిపిట్ట, అప్పపల్లి, గుండి, కెరమెరి మండలం నిషాని, ఇందాపూర్, ఉమ్రి, ఆగర్వాడ, కైరీ, లేండి గూడ, బోల పాఠర్ గ్రామాలతో పాటు జైనూర్, సిర్పూర్ (యు), వాంకిడి, తిర్యాణి మండలాల్లో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో తుమ్మిడిహెట్టి వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రాజెక్టులలోకి వరద నీరు చేరడంతో కుమురంభీం, వట్టివాగు ప్రాజెక్టుల స్పిల్వే గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.






