6 April, 2026 | 3:08 AM

కూలిన మెట్రో పిల్లర్ స్లాబ్

15-02-2026 12:00 AM

ముంబైలో ఘటన.. ఒకరి మృతి

ముంబై, ఫిబ్రవరి 14: ముంబైలోని ములుండ్‌లో నిర్మాణ దశలో ఉన్న మెట్రో పిల్లర్ స్లాబ్ శనివారం మధ్యాహ్నం కుప్పకూలి ఆటోపై పడింది. ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న ముంబై ఫైర్ బ్రిగేడ్, పోలీసులు, మెట్రో అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న ఆటోను బయటకు తీశారు. ఆటో ఒకరి మృతదేహంతోపాటు ఇద్దరు క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చారు.

మృతుడిని ఉత్తరప్రదేశ్‌లోని భరతనే గ్రామ సర్పంచ్ రాంధాని యాదవ్ (55)గా గుర్తించారు. క్షతగాత్రులను ఇదే గ్రామానికి చెందిన మహేంద్ర యాదవ్, బబ్లూ యాదవ్‌గా గుర్తించారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని మేయర్ రీతు తావ్డే పరిశీలించారు. మరోవైపు ప్రమాదంపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.