ఆటోల్లో సేకరణ, లారీల్లో రవాణా !
- కంట్రోల్ బియ్యానికి కాళ్లు!
- పల్లెలు, పట్టణాలు దాటుతున్న పేదల రేషన్
- లబ్ధిదారులు, డీలర్ల వద్ద దళారుల కొనుగోలు
- రైసు మిల్లర్లకు లాభాలతో అమ్మకాలు
- తనిఖీలకు సివిల్ సప్లయ్ అధికారుల చిన్నతనం
- పెద్దపల్లి కేంద్రంగా భారీ దందా
పెద్దపల్లి (మంథని), జూన్ 6 (విజయక్రాంతి): సౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. కరోనా సమయం నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉచితంగా బియ్యం అందజేస్తున్నది. ఇదే అదనుగా దళారులు పేదల దగ్గర బియ్యం కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నాతా ధికారులు పట్టించుకోవడం లేదు. గ్రామాల్లో పేదలకు డబ్బాశ చూపి కొందరు దళారులు కిలో రూ.10 నుంచి రూ.13లతో బియ్యం కొంటున్నారు.
వాటిని రైస్ మిల్లులకు, కోళ్ల ఫారాలకు కిలో రూ.15 నుంచి రూ.20 చొప్పున విక్రయించి లాభసాటి వ్యాపారంగా మార్చుకున్నారు. ఈ బియ్యం కోళ్లఫారాల్లో దాణాగా వాడుతుండగా, రైస్ మిల్లర్లు ఆ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి డబుల్ రేటుతో మార్కెట్లో విక్రయిస్తూ అధిక లాభాలు గడిస్తున్నారు. అయితే, ఇదంతా అక్రమ వ్యాపారమే అయినా.. అడ్డుకట్ట వేయాల్సిన సివిల్ సప్లయీస్, రెవెన్యూ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఇకదళారులకు అడ్డులేకపో వడంతో పెద్దపల్లి, గోదావరిఖని, మంథని నియోజవర్గంలోని గ్రామాల్లో ఆటోల్లో సేకరించి, అటు నుంచి రైస్ మిల్లర్లకు, కోళ్ల ఫారాలకు లారీల్లో రవాణా చేస్తున్నారు. ఏకంగా మంథని టూ మహారాష్ట్ర వరకు ఈ వ్యాపారం జోరుగా నడుస్తున్నట్లు తెలుస్తోంది.
లక్షల్లో వ్యాపారం.. వేలల్లో మామూళ్లు..
సబ్సిడి ద్వారా పేదలకు రూపాయికే కిలో బియ్యం లభిస్తోంది. అయితే అక్రమ దందా పరిస్థితిని బట్టి వ్యాపారులు కిలో బియ్యం రూ. 10 నుంచి 12 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన వాటిని రూ. 20 నుంచి రూ. 25 వరకు మిల్లర్లకు, కోళ్ల ఫారాలకువిక్రయిస్తున్నారు. దీంతో దళారులకు ఈ వ్యాపారంలో లక్షల్లో లాభాలు వస్తున్నాయి. ఇక దంతా సాఫీగా సాగడానికి రెవెన్యూ అధికారులను, అటు సివిల్ సప్లు అధికారులను మచ్చిక చేసుకొని ప్రజా ప్రతినిధుల సహకరంతో నెలనెలా వేలల్లో మామూళ్లు ఇస్తూ దందాకు అవరోధాలు లేకుండా చేసుకుంటున్నారు.
మానేరుపై మట్టిరోడ్డు వేసి..
భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలను కలుపుతూ అధికారుల అనుమతులు లేకుండా ముత్తారం మండ లంలోని ఓడేడు మానేరులో దాదాపు పది లక్షలతో అక్రమంగా మట్టి రోడ్డు కూడా నిర్మించికున్నట్లు తెలుస్తోంది. సేకరించిన బియ్యాన్ని లారీల్లో నింపి రాత్రివేళల్లో నిరాటంకంగా రేషన్ బియ్యం హద్దులు దాటి పోతున్నట్లు తెలుస్తోంది. ఈ మార్గంలో పోలీస్ నిఘా లేకపోవడంతో అక్రమ దందాలకు రాచమా ర్గంగా మారినట్లు తెలుస్తోంది. ధవా రం రాత్రి భూపాలపల్లి జిల్లా నుంచి ఈ మార్గంలోనే రవాణా అవుతున్న 100 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసు లు పట్టుకోవడంతో ఈ రహదారి అసలు కథ బట్టబయలైంది. గతం లో ఈ రోడ్డును స్థానికులు ధ్వంసం చేసినా.. అక్రమ వ్యాపారుల ముఠా మళ్లీ నిర్మించుకున్నట్లు తెలుస్తోంది.






