రాజకీయ లబ్ధికే మతవిద్వేషాలు
కుమ్రంభీం ఆసిఫాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): రాజకీయ లబ్ధికోసం బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొట్టేందని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ఆరోపించారు. గురువారం జిల్లా కేంద్రంలోని డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ ప్రజల తీర్పును గౌరవిస్తానని చెప్పారు. ప్రాణమున్నంత వరకు ప్రజలకు సేవలందిస్తానని తెలిపారు. ఆసిఫాబాద్ నియోజవర్గంలో మత రాజకీయాలు చేసినప్పటికీ, బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి 26,940 ఓట్లు అత్యధికంగా రావడం సంతోషంగా ఉన్నదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ శ్రేణులతో కలసికట్టుగా పనిచేసి, ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, పార్టీ మండల అధ్యక్షుడు చరణ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.






