1 July, 2026 | 2:52 PM

వడ్ల పైసల కోసం రోడ్డెక్కిన రైతులు.. మల్కపేటలో ధర్నా, రాస్తారోకో

01-07-2026 02:07 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో ధాన్యం విక్రయించిన రైతులకు చెల్లించాల్సిన బకాయిలు రెండు నెలలు గడిచినా అందకపోవడంతో బుధవారం రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం విక్రయించి చాలా కాలం అయినప్పటికీ డబ్బులు తమ ఖాతాల్లో జమ కాకపోవడంతో రైతులు గ్రామంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. "ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలి" అంటూ నినాదాలు చేస్తూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. పెట్టుబడుల కోసం తీసుకున్న అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయని, అధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళా రైతులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని తమ గోడును వెళ్లబోసుకున్నారు.రైతుల రాస్తారోకో కారణంగా కొంతసేపు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. సమాచారం అందుకున్న కోనరావుపేట పోలీసులు, రెవెన్యూ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, బకాయి చెల్లింపులు త్వరితగతిన జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధికారుల హామీతో రైతులు తమ ఆందోళనను విరమించారు. అయితే ధాన్యం విక్రయించిన రైతులకు వెంటనే బకాయిలు చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.