భార్య చేతిలో భర్త దారుణ హత్య
మద్యం మత్తులో నిత్యం గొడవలు.. కోపంతో కర్ర, తాపీతో దాడి
పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి పట్టణంలో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. అతిగా మద్యం సేవించి తరచూ గొడవలు చేస్తున్న భర్తను భార్య దారుణంగా హత్య చేసిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దపల్లి పట్టణంలోని హనుమాన్ నగర్ రైల్వే స్టేషన్ ప్రాంతానికి చెందిన గద్దల శ్రీనివాస్ తన కుటుంబంతో నివసిస్తున్నాడు. అతని భార్య గద్దల పుష్పలత ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తోంది. శ్రీనివాస్ మద్యం సేవించి తరచూ ఇంటికి వచ్చి భార్యతో గొడవపడుతుండేవాడని స్థానికులు తెలిపారు.
మంగళవారం రాత్రి కూడా ఇదే విషయంపై దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన పుష్పలత కర్ర, తాపీతో శ్రీనివాస్‌పై దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పెద్దపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దపల్లి సీఐ ప్రవీణ్ తెలిపారు. ఈ ఘటన పెద్దపల్లి పట్టణంలో తీవ్ర సంచలనం రేపింది.






