29 July, 2026 | 8:54 AM

అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించిన కలెక్టర్ ఆశీష్‌ సంగ్వాన్

29-05-2024 08:29 PM

నిర్మల్ : విద్య సంవత్సరం పాఠశాలలు ప్రారంభం అయ్యేనాటికి విద్యార్థులకు ఏక రూప దుస్తువులను సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. పట్టణంలోని మంజులాపూర్‌లో మెప్మా ఆధ్వర్యంలో మహిళ సంఘాలకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏక రూప దుస్తువులు తయారు చేస్తున్న కేంద్రాలను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పక్రియను వేగంగా పూర్తిచేసి పాఠశాలలు తెరిచే నాటికి అందించాలని సూచించారు. కొలతల ప్రకారం కుట్టాలని నాణ్యత ఉండేటట్లు చూడాలన్నారు. విద్యార్థుల సంఖ్య  వరకు ఇచ్చిన ఆర్డరు, కుట్టిన దుస్తువుల వివరాలు అడిగి తెలుసుకొన్నారు. విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అనంతరం సిద్దపూర్ పాఠశాలలో జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులను తనిఖీ చేశారు. జూన్ 5 నాటికి పనులు పూర్తిచేయాలని అధికారులను కోరారు. పనులు నాణ్యతగా ఉండాలని ప్రతి రోజు పనులను సంబంధిత అధికారులు పరిశీలించి రిపోర్టు చేయాలన్నారు. పాఠశాలలో మౌళిక సదుపాయాలు కల్పించాలన్నారు. తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, గ్రిల్లు, పెయింటింగ్ తదితర పనులు పూర్తి సూచించారు. సోన్ మండలంలోని లోకల్ వెల్మల్ పాఠశాలను సందర్శించి ఈనెల 31 లోపు పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.