29 July, 2026 | 9:57 AM

అన్నదాతలను ఇంకా అరిగోస పెట్టకండి

29-05-2024 11:41 AM

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. విత్తనాల కోసం రైతన్నలు పడుతున్న కష్టాలపై కేటీఆర్ ద్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..?  లేనట్టా..? అని కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. విత్తనాల కోసం రైతులు కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి,  ముందుచూపు లేని ముఖ్యమంత్రి ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప.. ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా అన్నారు. నిన్న.. ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోళ్లు లేరు.. నేడు.. విత్తనాలు కొందామంటే అమ్మేటోళ్లు లేరని నిలదీశారు. పాలన పూర్తిగా పడకేసిందని చెప్పడానికి..  ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలన్నారు. సాగునీళ్లు ఇవ్వడం చేతకాక పంటలు ఎండగొట్టారు.. ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా అని ప్రశ్నించారు.

 తెల్లవారుజామున 4 గంటలకు లైన్ లో నిలబడితే.. సాయంత్రం 4 గంటల వరకూ విత్తనాలు ఇవ్వలేరా, గత పదేళ్లపాటు.. 10 నిమిషాల్లో అందిన విత్తనాలు అందించామని పేర్కొన్నారు. 10 గంటలపాటు పడిగాపులు పడినా అందించలేరా ? రంగారెడ్డి నుంచి.. కామారెడ్డి దాకా.. రైతులకు ఎందీ ఈ కష్టాలు.. ఇంకెన్నిరోజులు ఈ కన్నీళ్లు.. దేశం కడుపునింపే స్థాయికి ఎదిగిన తెలంగాణ..  అన్నదాతకే తిండితిప్పలు లేకుండా చేస్తారా ? అని కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో పండుగలా సాగిన వ్యవసాయాన్ని,అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఆగం చేశారని ద్వజమెత్తారు. ఇప్పటికైనా.. సరిపడా విత్తనాల స్టాక్ తెప్పించి, బ్లాక్ మార్కెట్ కు తరలించకుండా కళ్లెం వేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వచ్చింది.. కాటగలిసినం అంటున్న.. అన్నదాతలను ఇంకా అరిగోస పెట్టకండని ఆయన కోరారు. లేకపోతే.. రైతుల సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని.. కాంగ్రెస్ ప్రభుత్వం చవిచూడక తప్పదని హెచ్చరించారు.