29 July, 2026 | 7:55 AM

బాలసదన్‌లో ఏం జరుగుతోంది?

30-05-2024 12:05 AM

మహబూబ్‌నగర్, మే 29 (విజయక్రాంతి): మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బాల సదన్‌లో ఆశ్రయం పొందుతున్న ఇద్దరు బాలికల మిస్సింగ్ అనేక విమర్శలకు తావిస్తున్నది. విధి రాతతో తల్లిదండ్రులు దూరమై, నా అనుకునే వారు లేక ఆశ్రయం పొందుతున్న అభాగ్యులను కంటికి రెప్పలా కాపాడాల్సిన బాల సదన్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఈ ఘటన సంభవించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం రాత్రి అడ్డాకుల మండల కేంద్రానికి చెందిన బాలిక, జడ్చర్లకు చెందిన మరో బాలిక ఇద్దరూ గోడదూకి పారిపోయినట్లు అధికారులు గుర్తించారు. మర్నాడు ఉదయం మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

జనవరిలోనూ మిస్సింగ్..

అనాథ అయిన ఓ బాలిక కస్తూర్బా విద్యాలయంలో చదువుతూ జనవరిలో సంక్రాంతి సెలవులకు బాలసదన్‌కు వచ్చింది. వచ్చిన ఆ మర్నాడు ఆమె బాలసదన్‌లో కనిపించలేదు. బాలిక మిస్సింగ్‌కు బాలల సంక్షేమ కమిటీ సభ్యుడే కారణమని ఆరోపణలు వచ్చాయి. దీంతో మార్చిలో ఇదే రూరల్ పోలీస్ స్టేషన్‌లో బాలసదన్ అధికారులు కేసు పెట్టారు. నిందితుడిని పోలీసులు కోర్టులు హాజరుపరచగా, కోర్టు నిందితుడికి రిమాండ్ విధించింది. బాలికల మిస్సింగ్‌పై బాల సదనం ఇన్‌చార్జ్ యాదమ్మను వివరణ కోరగా.. సోమవారం రాత్రి ఇద్దరమ్మాయిలు గోడదూకి బయటకు వెళ్లిన విషయం వాస్తవమేనన్నారు. బాలికల సంరక్షణకు సమగ్రమైన చర్యలు తీసుకుంటామన్నారు. సిబ్బంది నిర్లక్ష్య వైఖరిని సహించబోమని సమాధానమిచ్చారు.