ఎల్లంపల్లిని సందర్శించిన అధికారులు
తాగునీటి సరఫరాకు చర్యలు: కలెక్టర్ సంతోశ్
మంచిర్యాల, మే 10 (విజయక్రాంతి) : ఎండా కాలం పూర్తయ్యే వరకు జిల్లా వ్యాప్తంగా ప్రజలందరికీ సరిపడా తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బదావత్ సంతోశ్ తెలిపారు. ‘పాతాళానికి భూగర్భ జలం’ పేరిట ‘విజయక్రాంతి’ పత్రికలో ఇటీవల ప్రచురితం అయిన కథనానికి అధికారులు స్పందించారు. శుక్రవారం హాజీపూర్ మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టును మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, మిషన్ భగీరథ ఈఈ మధుసూదన్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్లంపల్లి ప్రాజెక్టు సెగ్మెంట్ పరిధిలో వేసవి పూర్తయ్యే వరకు నిరంతర తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి అందుతున్న తాగునీటి సరఫరా ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మిషన్ భగీరథ పథకం కింద జిల్లాలో జరుగుతున్న నీటి సరఫరాపై ప్రతి రోజు నివేదిక అందించాలని కోరారు.






