25 April, 2026 | 9:12 AM

నేటితో అంతా గప్‌చుప్

11-05-2024 02:35 AM

ప్రచారానికి తెర.. గెలుపే లక్ష్యంగా ప్రయత్నాలు

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 10 (విజయక్రాంతి): చూస్తుండగానే లోక్‌సభ ఎన్నిక ల ప్రచారం ముగింపు దశకు చేరింది. ప్రచారానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగి లి ఉంది. ప్రచారం ముగుస్తుండటంతో ఈ రోజు సాయంత్రం 6గంటల తర్వాత అంతా గప్‌చుప్ కానుంది. ప్రచారం గడువు ముగుస్తుండడంతో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు నిర్విరామంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన పోలింగ్‌కు సమయం ఆసన్నం అవుతుండటంతో అభ్యర్థులు, పార్టీలు పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టనున్నారు. 

హోరెత్తిన ప్రచారం 

నగరంలోని ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు, ఎంపీ అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తించారు. ఎన్నికల  కమిషన్ సార్వత్రిక ఎన్నికల తేదీ ప్రకటించిన మార్చి 16నుంచి ఈ రోజు వరకు ప్రత్యర్థుల ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఎంపీ అభ్యర్థులు ప్రచార పర్వాన్ని సాగించారు. కోడి కూసినప్పటి నుంచి అర్ధరాత్రి దాటే వరకూ పగలు, రాత్రి తేడా లేకుండా గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్లారు.

కరప త్రాలు, ప్రచార వాహనాలు, వార్తాపత్రికలు, సోషల్ మీడియా, డిజిటల్ స్క్రీన్లు, ప్రైవేటు కాల్స్ ద్వారా ఏ ఒక్క సాధనాన్ని వదలకుండా విస్తృత ప్రచారం చేశారు. సాంప్ర దాయ పద్దతి అయిన ఇంటింటి ప్రచారం, ర్యాలీలు నిర్వహించడంతో పాటు టెక్నాలజీని ఉపయోగించి సోషల్ మీడియా ప్రచా రం వరకు అన్ని మార్గాలను అభ్యర్థులు ఉపయోగించారు. ఇక మిగిలింది పోలింగే కావడంతో సార్వత్రిక ఎన్నికల సమరంలో గెలిచి లోక్‌సభలో అధ్యక్షా అనడం కోసం ఎదురు చూస్తున్నారు. 

నగరంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా, కాం గ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ సహా పలువురు ముఖ్య నాయకులు వారి పార్టీల అభ్యర్థుల తరపున పలు సభలు, సమావేశాల్లో పాల్గొనడం విశేషం. 

క్షేత్రస్థాయి నుంచి నెట్‌వర్క్

ప్రచారం నేటితో ముగుస్తున్నప్పటికీ తమ గెలుపు కోసం అభ్యర్థులు క్షేత్రస్థాయి నుంచే పగడ్బందీ ప్రణాళికతో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం బూత్‌లెవల్ నెట్‌వర్క్‌ను బలంగా నిర్మించుకున్నారు. 100మంది ఓటర్లకు ఓ ఇన్‌చార్జిని నియమించుకుని మిగతా రెండు రోజులు ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పోలింగ్‌కు మిగిలిం రెండు రోజులే కావడంతో ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి బూత్‌స్థాయి నాయకులు నిర్వీరామంగా శ్రమిస్తున్నారు. నగరంలో పోలింగ్ శాతం తక్కువ నమోదయ్యే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ వారిని కూడా రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. బూత్‌లెవల్ నుంచే ప్రత్యేక యం త్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు.