21 April, 2026 | 8:35 PM

గురుకులాల్లో సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ

21-04-2026 06:46 PM

* అటంకం లేకుండా మొక్క కొనుగోళు జరగాలి

* నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

అచ్చంపేట: గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, సదుపాయాల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళిక లో భాగంగా సంక్షేమ వారోత్సవాల సందర్భంగా మంగళవారం అచ్చంపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర విద్యాలయాన్ని సందర్శించి పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. వసతి గృహా పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడారు.  విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు పరిశుభ్రత కీలకమని, ప్రతి విభాగంలో శుభ్రతను నిరంతరం పాటించాలని ఆదేశించారు.

ముఖ్యంగా వంటశాలలో ఆహారం తయారీ సమయంలో నాణ్యత ప్రమాణాలు, శుభ్రతపై ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. విద్యార్థులకు అందించే ఆహారం పోషకాహార ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, సరైన డైట్‌ ప్లాన్‌ను అమలు చేయాలని, ఆహార భద్రత విషయంలో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. పాఠశాలలో అవసరమైన మౌలిక వసతుల కల్పన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అన్ని మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

సంక్షేమ వారోత్సవాల భాగంగా నిర్వహించిన క్విజ్, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలను పరిశీలించారు. విద్యార్థుల్లో దాగిన ప్రతిభను వెలికితీయడంలో ఇలాంటి పోటీలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలపై కూడా కలెక్టర్ ఆరా తీశారు. విద్యార్థుల మార్కులను అడిగి తెలుసుకుని, మెరుగైన ఫలితాలు సాధించిన వారిని అభినందిస్తూ,  ఉన్నత లక్ష్యాలను సాధించాలని ప్రోత్సహించారు.

అనంతరం దేవదారికుంట తండా వద్ద ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియ సమీక్షించి  రైతులతో  మాట్లాడారు. కొనుగోలులో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.  ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర అమలు కావాలన్నారు. కొనుగోలు కేంద్రం వద్ద తాగునీరు, నీడ, కూర్చునే సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించి కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో అచ్చంపేట ఆర్డీఓ యాదగిరి, తహసీల్దార్ సైదులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈఓ కొమ్ము ఎల్లయ్య, ఆర్ఐ బలరాం, శివ, పీఏసీఎస్ మల్లేష్, రైతులు పాల్గొన్నారు.