25 June, 2026 | 2:31 AM

గిరిజన గురుకులంలో నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం

25-06-2026 01:16 AM

24 గంటల్లో పరిశుభ్రత చర్యలు చేపట్టాలని ఆదేశం

అశ్వాపురం, జూన్ 24, (విజయక్రాంతి): అశ్వాపురం మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం విస్తృతంగా పర్యటించి గొందిగూడెం గిరిజన ఆశ్రమ గురుకుల బాలుర పాఠశాలతో పాటు ఇందిరమ్మ ఇండ్ల సర్వే పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గిరిజన గురుకుల పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్, తరగతి గదులు, వసతి గృహాలు, వంటశాల, పాఠశాల ఆవరణలను తనిఖీ చేసిన కలెక్టర్, పరిశుభ్రత మరియు నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం కనిపించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ముఖ్యంగా కంప్యూటర్ ల్యాబ్లో కంప్యూటర్లు దుమ్ము, ధూళితో అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందించే భోజనం ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం లేదని గుర్తించి హాస్టల్ వార్డెన్కు మెమో జారీ చేయాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణ, వసతి గృహాలు, వంటశాల తదితర ప్రాంతాల్లో 24 గంటల్లో పూర్తిస్థాయిలో పరిశుభ్రత చర్యలు చేపట్టి నివేదిక సమర్పించాలని సూచించారు.

అనంతరం కొత్తూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన నాణ్యతపై ఆరా తీశారు. తరువాత ఎలకలగూడెం గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరిశీలించి అర్హులైన ప్రతి కుటుంబాన్ని గుర్తించి పారదర్శకంగా సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మండలంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన 3,448 దరఖాస్తుల్లో ఇప్పటికే 2,075 దరఖాస్తుల సర్వే పూర్తయ్యిందని, 409 గుడిసెలను గుర్తించినట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ పర్యటనలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఎంపీడీవోతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.