15 July, 2026 | 8:59 PM

కేజీబీవీలపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

15-07-2026 08:57 PM

భోజనం నాణ్యత నుంచి సీసీ కెమెరాల వరకు క్షుణ్ణంగా పరిశీలన..

 నిర్లక్ష్యంపై వహిస్తే చర్యలు తప్పవన్న కలెక్టర్ హైమావతి

హుస్నాబాద్: జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యార్థులకు మెరుగైన వసతి, నాణ్యమైన భోజనం, భద్రత కల్పించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని జిల్లా కలెక్టర్ కె. హైమావతి స్పష్టం చేశారు. అన్ని కేజీబీవీల్లో సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం హుస్నాబాద్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్, వంటగది, స్టోర్‌రూమ్, స్టాక్ రిజిస్టర్లు, విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.

రిజిస్టర్లలో నమోదైన వివరాలకు అనుగుణంగా సరుకులు వినియోగిస్తున్నారా అనే విషయాన్ని తనిఖీ చేసి అధికారులను ఆరా తీశారు. విద్యార్థుల హాజరుకు అనుగుణంగానే సరుకులు వినియోగించాలని, ప్రభుత్వం నిర్దేశించిన కామన్ డైట్ మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. ప్రతి వంటకం పరిశుభ్రంగా, నాణ్యతతో తయారు చేసి విద్యార్థులకు అందించాలని ఆదేశించారు. తనిఖీ సందర్భంగా సీసీ కెమెరాలు సరిగా పనిచేయకపోవడాన్ని గుర్తించిన కలెక్టర్, విద్యాలయ ప్రాంగణమంతా నిరంతర నిఘా ఉండేలా వెంటనే వాటిని మరమ్మతు చేసి పనిచేసే స్థితిలో ఉంచాలని ఆదేశించారు. 

విద్యార్థులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కోతుల బెడద ఉందని విద్యార్థులు చెప్పడంతో సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. స్టోర్‌రూమ్‌లో సరుకుల కొలత విద్యార్థుల సమక్షంలోనే నిర్వహించాలని, విద్య, భోజనం, వసతి, భద్రత విషయంలో ఎలాంటి లోటు ఉండకూడదని స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.