చెక్ బౌన్స్ కేసుల్లో రాజీ కుదర్చాలి
- జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.సుదర్శన్
సిద్దిపేట క్రైం: ఈ నెల 18న జరిగే ప్రత్యేక లోక్ అదాలత్ లో పెద్దసంఖ్యలో చెక్ బౌన్స్ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని న్యాయసేవాధికారసంస్థ జిల్లా చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.సుదర్శన్ న్యాయవాదులు, బ్యాంకు మేనేజర్లకు సూచించారు. బుధవారం సిద్దిపేట జిల్లా కోర్టు భవనంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 1,324 చెక్ బౌన్స్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు.
స్పెషల్ లోక్ అదాలత్ లో అధికసంఖ్యలో కేసులు రాజీపడేటట్లు చూడాలని న్యాయవాదులకు, బ్యాంకు మేనేజర్లకు సూచించారు. ఈ సమావేశంలో ఒకటో అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి వై.జయప్రసాద్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎన్.సంతోష్ కుమార్, ఒకటో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వి.తరణి, బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అరుణ, న్యాయవాదులు, న్యాయసేవ సిబ్బంది పాల్గొన్నారు.






