రెవెన్యూ సదస్సులను పరిశీలించిన కలెక్టర్
చెన్నూర్, జూన్ 4: మండలంలోని బుద్దా రం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న రెవెన్యూ సదస్సును కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం మండల తహశిల్దార్ మల్లిఖార్జున్‌తో కలిసి సందర్శించి దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్.ఓ.ఆర్. చట్టంలో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులలో భూసమస్యలపై అందిన దరఖాస్తులను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు.
ఈ దరఖాస్తులను రికార్డులతో సరి చూసి, క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించే దిశగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 20వ తేదీ వరకు జిల్లాలోని భీమారం మినహా అన్ని మండలాలలో కార్యచరణ ప్రకారం రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.
అనంతరం పాఠశాలలో జరుగుతున్న వంటశాల నిర్మాణ పనులు పరిశీలిం చి వేగవంతం చేసి విద్యా సంవత్సరం ప్రారంభంలోగా పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం చెన్నూర్ పట్టణంలో కొనసాగుతున్న అమృ త్ 2.0 పనులను మున్సిపల్ కమీషనర్ మురళీకృష్ణతో కలిసి పరిశీలించారు.






