7 April, 2026 | 9:31 PM

ఆరోగ్య కేంద్రాలలో మెరుగైన వైద్య సేవలు అందించాలి

07-04-2026 08:08 PM

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఆసుపత్రిలో మందుల నిల్వలు సమృద్ధిగా ఉంచాలి

ఖమ్మం వెంకటేశ్వర్ నగర్ అర్బన్ పిహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ఖమ్మంటౌన్,(విజయ క్రాంతి): ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. జిల్లా కలెక్టర్, స్థానిక వెంకటేశ్వర నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి, ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, మందుల నిల్వలు, ల్యాబ్, మెడికల్ వార్డ్, టాయిలెట్లు, శుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆసుపత్రిలో అవసరమైన ఔషధాల లభ్యతపై ప్రత్యేకంగా విచారించి, అన్ని రకాల అవసరమైన మందులను తగిన స్థాయిలో నిల్వ ఉంచాలని ఆదేశించారు.

ఆసుపత్రి రిజిస్టర్లన్నింటినీ స్వయంగా పరిశీలించి, రోగులకు అందుతున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్ పరీక్షలు, డయాగ్నస్టిక్ హబ్ సేవల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, అన్ని పరీక్షల రిపోర్ట్ లను వీలైనంత త్వరగా రోగులకు అందించాలని ఆదేశించారు. రోగులకు సమయానికి సరైన చికిత్స అందించడంతో పాటు అవసరమైన అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచి, రోగులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని అన్నారు.

సిబ్బంది సమయపాలన పాటిస్తూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. జిల్లాలోని ప్రతి పి.హెచ్.సి., అర్బన్ పి.హెచ్.సి. లలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది వివరాలను సమగ్రంగా సమర్పించాలని, ప్రతి కేంద్రంలో మంజూరు చేసిన పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది, ఖాళీల వివరాలను స్పష్టంగా తెలియజేయాలని, ఈ నివేదిక ఆధారంగా జిల్లాలో సిబ్బంది ఎక్కడ తక్కువగా ఉన్నారో గుర్తించి తక్షణమే సరి చేయడానికి అవకాశం ఉంటుందని,  డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న సిబ్బంది సంఖ్యను కూడా ఖచ్చితంగా ధృవీకరించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ ఏఓ డాక్టర్ మోత్యను ఆదేశించారు.