చీపురు పట్టారు.. చెత్తను తొలగించారు
పారిశుధ్యం, ఫైళ్ల క్లియరెన్స్‌పై కలెక్టర్ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం
ప్రభుత్వ కార్యాలయాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించిన రాజర్షి షా
ఆదిలాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఆహ్లాదకరమైన కల్పించే లా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల ని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో బాగంగా సోమవారం కలెక్టరేట్ లో పారిశుధ్యం, ఫైళ్ల క్లియరెన్స్ పై చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, జిల్లా అధికారులు, మున్సిపల్ సిబ్బందితో కలిసి కలెక్టర్ స్వయంగా చీపురు పట్టుకొని కలెక్టరేట్ ప్రాంగణంలో చెత్తాచెదారాన్ని తొలగించారు. అనంతరం కలెక్టరేట్ లోని డిపిఆర్‌ఓ, ట్రెజరీ, ఆర్డీఓ, సిపిఓ కార్యాలయాలను సందర్శించి అధికారులకు పారిశుద్యం, ఫైల్ ల నిర్వహణపై అవగాహన కల్పిస్తూ, పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, పెండింగ్లో ఉన్న ఫైళ్లను సత్వరమే పరిష్కరించడమే ఈ డ్రైవ్ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.
ప్రతిరోజూ అధికారులు కనీసం ఒకటి నుండి రెండు గంటల సమయాన్ని తమ కార్యాలయ ప్రాంగణాల శుభ్రతకు కేటాయించాలని ఆదేశించారు. కార్యాలయాల్లో పేరుకుపోయిన పాత సామాన్లు, విరిగిన ఫర్నీచర్, స్క్రాప్ను వారం రోజుల్లోగా తొలగించాలని స్పష్టం చేశా రు. కార్యాలయాలు లోపల, వెలుపల ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని సూచిం చారు. కేవలం శుభ్రతకే పరిమితం కాకుండా, రికార్డుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, కార్యాలయాల్లో ఫైళ్లను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా రికార్డు రూముల్లో లేదా రాక్స్లో పద్ధతిగా అమర్చాలని ఆదేశించారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దేశిత కాలపరిమితి ముగిసిన ఫైళ్లను డిస్పోజ్ చేయాలని, ముఖ్యమైన ఫైళ్లను భద్రపరచాలని సూచించారు. పెండింగ్ ఫైళ్లను నిర్ణిత గడువులోగా క్లియర్ చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రానున్న ఐదు రోజుల్లో పురోగతిని తానే స్వయంగా పర్యవేక్షిస్తానని కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ స్రవంతి, మున్సిపల్ కమిషనర్ రాజు, కౌన్సిలర్ శ్వేత, అధికారులు పాల్గొన్నారు.




